రైతు సంక్షేమం కూట‌మి ప్ర‌భుత్వ ల‌క్ష్యం

VijayaBhaskar · April 9, 2026
Spread the love

స్ప‌ష్టం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి : రైతుల సంక్షేమం కోసం కూట‌మి ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని చెప్పారు వ్యవ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా అచంట నియోజ‌క‌వ‌ర్గంలోని మారుటోరు వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న కేంద్రంలో కిసాన్ మేళా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రై రైతుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. అంత‌కు ముందు ఏర్పాటు చేసిన స్టాళ్ల‌ను ప‌రిశీలించారు. కిసాన్ మేళాను నిర్వ‌హించిన అధికారుల‌ను అభినందించారు మంత్రి. ఈ సంద‌ర్బంగా రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ రైతులకు ప్రధానమంత్రి సన్మాన్ నిధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. రైతులు భూసార పరీక్షలపై తప్పకుండా అవగాహన కలిగి ఉండాలన్నారు. సేంద్రియ ఉత్పత్తులు సాగు చేయడానికి ఆలోచన చేయాలన్నారు. దేశీయ వినియోగాల్ని పెంచాలని సూచించారు. రాష్ట్రంలో నదులు అనుసంధానం ద్వారా సాగునీటి కొరత లేకుండా సాధ్యపడుతుందన్నారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మార్టేరు వ్యవసాయ పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసిన వరి వంగడాలు దేశ వ్యాప్తంగా విశేష గుర్తింపు పొందాయని తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని తెలిపారు. రబీ పంట కొనుగోలుకు 7.25 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించామని వెల్లడించారు.