తిరుమల తరహాలో అన్న ప్రసాద వితరణ చేపట్టాలి

VijayaBhaskar · April 17, 2026
Spread the love

స్ప‌ష్టం చేసిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలోని 111 దేవాలయాల్లో అన్న ప్రసాదాన్ని అందిస్తుంటే… 65 దేవాలయాల్లో నిత్యాన్నదానం అందిస్తున్నాం అన్నారు సీఎం. తిరుమల తరహాలోనే ఇతర దేవాలయాల్లోనూ అన్న ప్రసాదం అందించాలని దేవాదాయ శాఖ ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని దేవాలయాల్లో రోజుకు సుమారు 80 వేల మంది భక్తులకు అన్న ప్రసాదం అందుతోందన్నారు. దీని కోసం ఏడాదికి రూ. 157.85 కోట్లు వ్యయం అవుతోందని చెప్పారు. ఆయా దేవాలయాల్లో పాకశాలల్లో పని చేసే వారికి శిక్షణ ఇప్పించాల‌ని స్పష్టం చేశారు.

దేవాలయాల అభివృద్ధికి కామన్ గుడ్ ఫండ్ ద్వారా జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నిర్దిష్టమైన గడువులోడి సీజీఎఫ్ నిధులతో చేపట్టే దేవాలయాల నిర్మాణాలను పూర్తి చేయాలని పేర్కొన్నారు సీఎం. అన్ని ప్రధాన ఆలయాల్లో వాట్సాప్ ద్వారా సేవలు అందుబాటులోకి తీసుకు రావాలని అన్నారు. అన్ని రకాల సేవలను ఆన్ లైన్లో అందుబాటులో ఉంచాలని స్ప‌ష్టం చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు. అన్ని ఆలయాలకూ ప్రత్యేక వెబ్‌సైట్లు రూపొందించాలని అన్నారు. సమగ్ర వివరాలతో డ్యాష్‌బోర్డ్ కూడా అందుబాటులోకి తీసుకు రావాలన్నారు. ఆగమ సలహా మండలి, ఎండోమెంట్ ట్రిబ్యునల్ చైర్మన్, స్టాండింగ్ కౌన్సిల్ నియామకాన్ని త్వరితగతిన చేపట్టాల‌ని మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డిని ఆదేశించారు. ఇంకా పెండింగులో ఉన్న దేవాలయాల పాలక మండళ్లను వెంటనే నియమించాలని సీఎం సూచించారు.