డీ – లిమిటేష‌న్ పేరుతో కేంద్రం కుట్ర‌

VijayaBhaskar · April 17, 2026
Spread the love

నిప్పులు చెరిగిన వి. శ్రీ‌నివాస్ గౌడ్

న్యూఢిల్లీ : డీలిమిటేష‌న్ పేరుతో ద‌క్షిణాది రాష్ట్రాల‌కు ప్రాతినిధ్యం లేకుండా చేసేందుకు కేంద్రం కుట్ర‌కు తెర లేపింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ మంత్రి వి. శ్రీ‌నివాస్ గౌడ్. న్యూఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద జ‌రిగిన ధ‌ర్నాలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా కేంద్రం అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌ట్టారు. ఇదే సమ‌యంలో తాము మ‌హిళా బిల్లుకు ఎలాంటి అభ్యంత‌రం తెలియ చేయ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు చెందిన మ‌హిళ‌ల‌కు ప్రాతినిధ్యం ఉండాల‌ని కోరుతున్నామ‌ని అన్నారు. లేక‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు వి. శ్రీ‌నివాస్ గౌడ్.

మహిళలలో అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వక పోవడం, దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత తగ్గించడం అనేది కుట్రపూరిత మైన చర్య అని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అత్యధిక ఆదాయం ఇస్తున్న‌ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే కేంద్రంపై యుద్దం చేయాల్సి వ‌స్తుంద‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వి. శ్రీ‌నివాస్ గౌడ్. ఇలాగే కొనసాగితే భారతదేశం ఏదో ఒక రోజు దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం భాగాలుగా విడిపోయి ఉద్యమం వచ్చే ప్రమాదం ఉందన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని చిన్న చూపు చూడటం వల్ల తెలంగాణ ఉద్యమం పుట్టుకొచ్చిందన్నారు.