కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. తను చని పోయే లోపు గంగా కావేరి నదులను అనుసంధానం చేయాలన్నది తన కల అని అన్నారు. ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గంగా కావేరి నదులను కలిపితే దేశంలో నీటి ఎద్దడి అనేది ఉండదన్నారు. ఆయన పోలవరం నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్బంగా నిర్వాసితులకు రూ. 300 కోట్లకు పైగా పరిహారం అందజేశారు. రంపచోడవరంలో నియోజకవర్గంలో బ్రహ్మాండమైన రోడ్లు నిర్మిస్తున్నాం అన్నారు .2022లో వరదల సమయంలో పోలవరం ముంపు ప్రాంతంలో పర్యటించానని గుర్తు చేశారు సీఎం.
వరద బాధితులకు కనీసం భోజనం, నీళ్లు కూడా నాటి జగన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు. విశాఖలో హుద్ హుద్ వచ్చినప్పుడు వారం రోజులు అక్కడే ఉండి పరిస్థితి చక్కదిద్దాం అన్నారు. 2019 తర్వాత కూడా మా ప్రభుత్వం కొనసాగి ఉంటే పోలవరం 2020కే పూర్తయ్యేదన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం, నిర్లక్ష్యం వల్ల డయా ఫ్రమ్ వాల్ కొట్టుకుపోయేలా చేశారని ఆరోపించారు సీఎం. పోలవరం నిర్వాసితులకు పరిహారం పెంచుతామని హామీ ఇచ్చి మిమ్మల్ని మోసం చేశారన్నారు. గత పాలకులు అధికారులను మార్చారు. కాంట్రాక్టరును మార్చారు. ప్రాజెక్టును నాశనం చేశారని వాపోయారు. పోలవరం ప్రాజెక్టును మళ్లీ గాడిలో పెట్టాం… 2027 పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకిత చేస్తాం అని ప్రకటించారు.





