షిప్ బిల్డింగ్ పరిశ్రమకు ఏపీ అనుకూలం

VijayaBhaskar · June 15, 2026
Spread the love

స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

సింగ‌పూర్ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. తొలిరోజు పర్యటనలో ముందుగా సింగపూర్‌లోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులే ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. భారత్‌లో సింగపూర్‌కు ఉన్న ఆర్ధిక, వాణిజ్య ఒప్పందాలను ముఖ్యమంత్రికి వివరించారు. ఏపీ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలని సీఎం స్పష్టం చేశారు. సింగపూర్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని సీఎం కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, క్వాంటం టెక్నాలజీ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని సీఎం వివరించారు.

ఏపీలో కొత్తగా అందుబాటులోకి పోర్టులు అందుబాటులోకి వస్తున్నందున షిప్ బిల్డింగ్‌, సివిల్ ఏవియేషన్, మెయింటెనెన్సు, రిపేర్స్ ఓవర్ హాలింగ్ కేంద్రాలకు నెలకొల్పేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఏపీలో హార్టికల్చర్ ఉత్పత్తుల ట్రేసింగ్, సర్టిఫికేషన్‌కు వెళ్తున్నామని సీఎం వివరించారు. రోబోటిక్స్, మెడికల్ డివైజెస్, హార్డ్ వేర్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో సింగపూర్ సహకారం కోరుతున్నామని అన్నారు. సింగపూర్-ఏపీ విద్య సంస్థల మధ్య భాగస్వామ్యం ఏర్పాటుకు కృషి చేయాలని సీఎం కోరారు. ఈ సమావేశానికి మంత్రి పి.నారాయణ, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, ఈడీబీ సీఈఓ షన్మోహన్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.