సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్దం కావాలి
విద్యార్థులకు సుందర్ పిచాయ్ దిశా నిర్దేశం
అమెరికా : ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థలైన గూగుల్, ఆల్ఫా బెట్ కంపెనీల ముఖ్య కార్య నిర్వహణ అధికారిగా వ్యవహరిస్తున్న , ప్రవాస భారతీయుడైన , చెన్నైకి చెందిన సుందర్ పిచాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రపంచంలోనే టాప్ యూనివర్శిటీగా పేరు పొందిన స్టాన్ ఫోర్ట్ యూనివర్శిటీ స్నాత కోత్సవానికి హాజరయ్యారు. ఆయన ఈ కంపెనీలలో చేరక ముందు ఈ విశ్వ విద్యాలయంలోనే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ (ఎంఎస్) చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం కోట్లాది మంది ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్స్ ఆపరేటింగ్ చేస్తున్న ఆండ్రాయిడ్ ఫార్మాట్ ను తానే తయారు చేశాడు.
ఈ సందర్బంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు సుందర్ పిచాయ్. జీవితంలో మరిచి పోలేనిది ఏదైనా ఉందంటే అది విద్య మాత్రమేనని పేర్కొన్నారు. కీలకమైన మార్పులు వచ్చాయని, టెక్నాలజీ రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోందని చెప్పారు. టెక్నాలజీపై ఆధార పడిన వాళ్లు, ఈ రంగంలోకి రావాలని అనుకున్న వాళ్లు, ఇందులో ప్రస్తుతం పని చేస్తున్న వాళ్లు ఎప్పటికప్పుడు అప్ డేట్ కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి రోజూ సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని అలవర్చు కోవాలని సూచించారు సుందర్ పిచాయ్. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారాయి.