వైభవంగా శ్రీ పెరియాళ్వార్ ఉత్సవాలు ప్రారంభం

VijayaBhaskar · June 17, 2026
Spread the love

ప్రబంధ పాశురాల పారాయణంతో ఆధ్యాత్మిక వాతావరణం

తిరుపతి : తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీలక్ష్మీ నారాయణ స్వామి వారి ఆలయంలో శ్రీ వైష్ణవ సంప్రదాయ మహామహుడు, శ్రీమహావిష్ణువు పరమభక్తుడు అయిన శ్రీ పెరియాళ్వార్ ఉత్సవాలు అత్యంత వైభవంగా ఆరంభమయ్యాయి. ఈ ఉత్సవాలు జూన్ 25వ తేదీ వరకు భక్తిశ్రద్ధలతో కొనసాగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం, సాయంత్రం శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి తమ శిష్యబృందంతో కలిసి శ్రీ పెరియాళ్వార్ సన్నిధిలో దివ్యప్రబంధ పాశురాలను భక్తిపూర్వకంగా నివేదించి ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లారు.

శ్రీమహావిష్ణువు అనుగ్రహాన్ని పొందిన మహా భాగవతుడు, శ్రీ ఆండాళ్ అమ్మవారి తండ్రి అయిన శ్రీ పెరియాళ్వార్ తులసీ మాలలను స్వయంగా తయారు చేసి ప్రతిరోజూ స్వామివారికి సమర్పించేవారని, ఆయన రచించిన పాశురాలు నేటికీ వైష్ణవ సంప్రదాయానికి ఆధ్యాత్మిక మార్గదర్శకంగా నిలిచాయని అర్చకులు వివరించారు.

ఉత్సవాల చివరి రోజైన జూన్ 25న ఉదయం శ్రీ పెరియాళ్వార్‌కు తిరుమంజనం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం శ్రీ గోవిందరాజ స్వామివారు గరుడవా హనంపై, శ్రీ పెరియాళ్వార్ గజ వాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య మంగళ దర్శనం ప్రసాదించనున్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ చిరంజీవి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ధనుంజయ, ఇతర అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.