ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.కోటి విరాళం
దాతలను అభినందించిన టీటీడీ ఈవో
తిరుపతి : తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామికి నిత్యం పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. విద్య, వైద్యం, అన్నదానం , భక్తులకు వసతి సౌకర్యాలను కల్పించేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తోంది టీటీడీ పాలక మండలి . ఇదిలా ఉండగా తమ కోరిన కోర్కెలు నెరవేరిన భక్తులు తమకు తోచిన రీతిలో విరాళాలు అందజేస్తున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నిరుపేద రోగులకు ప్రాణదాతగా సేవలందిస్తున్న శ్రీ వేంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్‌కు హైదరాబాద్‌లోని షేక్‌పేట్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ వ్యవస్థాపకులు, చైర్మన్ అన్నే శ్రీనివాసరావు రూ.1 కోటి విరాళాన్ని అందజేశారు.
ఈ మేరకు విరాళానికి సంబంధించిన డిడిని తిరుపతిలోని టీటీడీ ఈవో నివాస కార్యాలయంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర కు అందించారు. ఈ సందర్భంగా ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు ఉదారంగా రూ.కోటి విరాళం అందించిన దాత అన్నే శ్రీనివాసరావును ఈవో అభినందించి, వారి సేవాభావాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు ఎన్. సదాశివరావు, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.