12 ఏళ్ల మోదీ పాలనా కాలంలో ఉద్యోగాలు ఎక్కడ..?
న్యూఢిల్లీ : పార్లమెంట్ సభ్యురాలు మహూవా మోయిత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం ఇంకా కొన్ని రోజుల పాటుగా కొనసాగుతూ వస్తూనే ఉంది. వివిధ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలంతా సీజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి మద్దతుగా నిలిచారు. మరికొందరు పాల్గొని కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ వచ్చారు. మరో వైపు ప్రజాస్వామిక, పర్యావరణ ఉద్యమకారుడు వాంగ్ చుక్ చేపట్టిన నిరాహారదీక్ష ఆరవ రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తోంది. మరో వైపు ఆయనకు ఏమైనా అయితే కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కే.
ఇదిలా ఉండగా ఇవాళ నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు ఎంపీ మహూవా మోయిత్రా. మిమ్మల్ని ఎన్నో పేర్లతో విమర్శిస్తారు.. కానీ వెనక్కి తగ్గొద్దు అని అన్నారు. చరిత్ర సృష్టించే అవకాశం మీ ముందుందని పేర్కొన్నారు.. దాన్ని వదులుకోకండి.. మేమంతా మీకు అండగా ఉంటాం అని ప్రకటించారు . గత 12 ఏళ్లుగా విద్యార్థులకు ఉద్యోగాలు రావడం లేదని అసలు ఈ సర్కార్ ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు. దేశంలో ఉన్న వనరులన్నీ ఒకే ఒక్క రాష్ట్రానికి చెందేలా చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న ప్రధానమంత్రి ఇచ్చిన మాట ఎక్కడ ఉందంటూ ప్రశ్నించారు మహూవా మోయిత్రా. ఏదో ఒక రోజు గద్దె దిగే రోజు తప్పకుండా వస్తుందని హెచ్చరించారు ఎంపీ.