Friday, 16 October 2026

ఏపీలో 12 ల‌క్ష‌ల బంగారు కుటుంబాల గుర్తింపు

hellotelugu-APGovt

చిత్తూరు జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 12 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు వెల్లడించారు. వీరికి అండగా నిలిచేందుకు ఇప్పటి వరకు 1.10 లక్షల మంది మార్గదర్శులు ముందుకు రావడం పీ4 కార్యక్రమంపై సమాజంలో ఏర్పడిన విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. డబ్బులు ఇచ్చి వెళ్లి పోవడం మాత్రమే ఈ కార్యక్రమం ఉద్దేశం కాదని, కుటుంబాల జీవన ప్రమాణాలను శాశ్వతంగా మెరుగు పరిచేలా మార్గనిర్దేశం చేయడమే అసలు లక్ష్యమని స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో 9 వేల బంగారు కుటుంబాలను అభివృద్ధి చేసే బాధ్యతను అదానీ, టీవీఎస్, మెగా సంస్థలకు అప్పగించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కుటుంబాల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, వారి జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకు రావడానికి సంస్థలు, మార్గదర్శులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

పీ4 కార్యక్రమం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగు పర్చుకున్న బంగారు కుటుంబాల విజయగాథలను రాష్ట్ర ప్రజలందరికీ చేరేలా చర్యలు తీసుకుంటామని చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. ఇలాంటి విజయాలు మరెంతో మందికి స్ఫూర్తినిస్తాయని చెప్పారు. అలాగే తమ జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు ముందుకొచ్చిన మార్గదర్శుల పట్ల బంగారు కుటుంబాలు కృతజ్ఞతాభావంతో ఉండాలని సూచించారు. అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరాలంటే ఆదాయాలు పెరగాలని, ఆర్థిక అసమానతలు తగ్గి ప్రతి కుటుంబం మెరుగైన జీవన ప్రమాణాలు సాధించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్రంలో పీ4 కార్యక్రమాన్ని దేశానికే ఆదర్శంగా నిలిచే నమూనాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *