Friday, 16 October 2026

రూ.335 కోట్ల ఖర్చుతో తొర్రూరు రోడ్డు విస్తరణ పనులు

newsseals-TorrurRoadWorks

హైదరాబాద్ : దాదాపు రూ.338 కోట్లతో వ్యయంతో ఎల్బీనగర్–ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో నాలుగు లైన్ల రహదారుల నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తో హ్యామ్ విధానంలో చేపట్టనున్న ఆధునిక నాలుగు లైన్ల రహదారుల నిర్మాణ పనులకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అధ్యక్షతన ఈ శంకుస్థాపన కార్యక్రమం జ‌రిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ ప్రతిష్టాత్మక రహదారి ప్రాజెక్టుల ద్వారా ఇబ్రహీంపట్నం ,ఎల్బీనగర్ నియోజక వర్గాల పరిధిలోని తుర్కయాంజాల్, తొర్రూర్, పెద్ద అంబర్పేట్, కుంట్లూరు, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో సెంట్రల్ లైటింగ్ సదుపాయాలతో కూడిన ఆధునిక ఫోర్ లైన్ రహదారులు నిర్మించనున్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా ప్రజలకు సురక్షితమైన, వేగవంతమైన, నాణ్యమైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు ట్రాఫిక్ రద్దీ తగ్గి, ప్రాంతీయ అభివృద్ధికి కొత్త ఊపు లభించనుంది.
హయత్‌నగర్ – తొర్రూరు – కోహెడ – అనాజ్‌పూర్ వరకు, అనాజ్‌పూర్ – అబ్దుల్లాపూర్‌మెట్ – బండరావిర్యాల వరకు, హయత్‌నగర్ – కుంట్లూరు – పసుమాముల – తారామతిపేట వరకు, సాగర్ రోడ్డు – ఇంజాపూర్ – తొర్రూరు – బ్రాహ్మణపల్లి – రాగన్నగూడ వరకు, సాగర్ రోడ్డు – ఇంజాపూర్ – హయత్‌నగర్ వరకు ఈ ప‌నులు జ‌రుగుతాయి. ప్రజా ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, గ్రామీణ–పట్టణ ప్రాంతాలను అనుసంధానించే రహదారులను ఆధునికీకరించే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *