శ్రీవారి భక్తులను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు
తిరుపతి : శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులతో అసభ్యంగా ప్రవర్తించడం, అదనపు డబ్బులు డిమాండ్ చేయడం, బెదిరింపులకు పాల్పడడం లేదా మానసిక వేధింపులకు గురిచేయడం వంటి చర్యలను ఏమాత్రం సహించబోమని తిరుపతి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎల్. సుబ్బరాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు తిరుమల II టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసులో నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. సికింద్రాబాద్‌కు చెందిన ఓ భక్తుడు తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చాడు. అనంతరం అరుణాచలం వెళ్లేందుకు AP 03 AT 4599 నంబర్ గల ఇన్నోవా వాహనాన్ని నడిపే స్థానిక టాక్సీ డ్రైవర్ కుమార్‌తో రూ.12,00కు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కుటుంబ సభ్యుల సామాను ఎక్కువగా ఉండటంతో వాహనానికి క్యారియర్ అమర్చాలని కోరగా డ్రైవర్ అంగీకరించాడు.
అయితే మరుసటి రోజు ఉదయం నిర్ణీత సమయానికి క్యారియర్ అమర్చక పోవడంతో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు బాధిత కుటుంబం మరో వాహనాన్ని ఏర్పాటు చేసుకుంది. దీనిపై ఆగ్రహం చెందిన డ్రైవర్ కుమార్, భక్తుల కుటుంబం మరో వాహనం ఎక్కకుండా అడ్డుకోవడమే కాకుండా, భక్తుడు , ఆయన భార్యను బహిరంగంగా దుర్భాషలాడి తీవ్రంగా బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా, బాధితుడి మొబైల్ నంబర్‌కు వివిధ నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ చేయడం, వాట్సాప్ ద్వారా అసభ్యకరమైన వాయిస్ మెసేజ్‌లు పంపించడం ద్వారా మానసిక వేధింపులకు గురిచేసినట్లు కూడా ఫిర్యాదులో వెల్లడైంది.
ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించిన తిరుపతి జిల్లా పోలీసులు నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి, సంబంధిత వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు తిరుపతికి, తిరుమలకు వస్తుంటారు. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడి భద్రత, గౌరవం, ప్రశాంతమైన యాత్ర కు అత్యున్నత ప్రాధాన్యత. భక్తులను మోసం చేయడం, బెదిరించడం, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం లేదా అదనపు డబ్బులు వసూలు చేయడం వంటి చర్యలపై కఠిన విధానంతో వ్యవహరిస్తాం అన్నారు. అలాంటి వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా, అవసరమైతే వారి వాహనాలను సీజ్ చేసి, డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు కూడా చర్యలు తీసుకుంటాం అని స్పష్టం చేశారు.