అమరావతి : ఏపీలో కరోనా వ్యాప్తి చెందుతోందన్న ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ కూటమి సర్కార్ అప్రమత్తమైంది. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. RF.5 అనేది SARS-CoV-2 వైరస్‌కు చెందిన ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ ఒక ఉప-వంశం (Sublineage). ఇది JN.1 వేరియంట్ నుంచి (LF.7 → PY.1.1.1 శాఖల ద్వారా) సహజ పరిణామానికి చెందిన ఉప-వంశం. ఇది రీకాంబినెంట్ (Recombinant) వేరియంట్ కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిని సాధారణ జీనోమిక్ పర్యవేక్షణ (Genomic Surveillance)లో భాగంగా నిరంతరం పరిశీలిస్తోందని ఏపీ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ తెలిపారు.
RF.5 లక్షణాలు ఇతర ఒమిక్రాన్ ఉప-వేరియంట్ల లక్షణాల మాదిరిగానే ఉంటాయని పేర్కొన్నారు. ముఖ్యoగా గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, తల నొప్పి, ముక్కు కారడం, మూసుకు పోవడం, త్వరగా అలసట , శరీర నొప్పులు ఉంటాయని వివరించారు. రాష్ట్రంలో చెదురు ముదురుగానే కేసులు ఉంటున్నాయని, పరిస్థితులకు తగ్గట్టుగా ఆసుపత్రులను పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉంచామన్నారు మంత్రి సత్య కుమార్ యాదవ్. బోధన ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులతో పడకలను సిద్ధం చేస్తున్నామని, కోవిడ్ కేసుల గుర్తింపునకు అవసరమైన కిట్లు, ఇతర మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నామని చెప్పారు. రాష్ట్రoలో ఇప్పటి వరకు 16 కోవిడ్ లు కేసు నమోదైనట్లు ప్రకటించారు సత్య కుమార్ యాదవ్.






