లిటిగెంట్ పిటిషనర్లకు కౌన్సెలింగ్ ఇవ్వాలి
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. లిటిగెంట్ పిటిషనర్లను ఏ విధంగా కట్టడి చేయాలని ఆదేశించారు. ఎలాంటి ప్రజా ప్రయోజనం లేకుండా చేసే ఫిర్యాదు దారులను గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 81 మంది లిటిగెంట్ పిటిషనర్లు ఉన్నట్టు గుర్తించాం అన్నారు. వీరు సరాసరి ఒక్కొక్కరు 246 పిటిషన్లు పెడుతున్నారు. వీరి వివరాలను జిల్లా కలెక్టర్లకు పంపించాలి. వారు పెట్టే అర్జీల్లో ప్రజా ప్రయోజనాలు ఉంటే వాటిని పరిశీలించాలి. ప్రభుత్వాన్ని, అధికారులను బద్నాం చేసే ఉద్దేశంతో పిటిషన్లు పెట్టే వారిని గుర్తించాలి. ఫిర్యాదుల పరిష్కారంలో ఆర్థికేతర సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ప్రాధాన్యతల వారీగా ఆర్థిక సమస్యలను పరిష్కరిద్దాం.
ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం కారణంగా ప్రస్తుతం 49 శాతం లోటు వర్షపాతం ఉంది. ఈ ప్రభావం నుంచి బయటపడేసే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. ఈ మేరకు రైతుల్లో అవగాహన కల్పించాలి. డ్రై క్రాప్స్ వేసేలా రైతులను ప్రొత్సహించండి. ఇదే సమయంలో వీబీ జీ రామ్ జీ పనులను పెద్ద ఎత్తున చేపట్టాలి. జలధార పనులకు వీబీ జీ రామ్ జీ పనుల్ని అనుసంధానం చేయాలి. ప్రజాభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పని విధానం మార్చుకోవాలి. పరిపాలనా విధానాలను మెరుగు పరుచుకోవాలి. సమస్యలు ఉత్పన్నమయ్యాక చర్యలు తీసుకోవడంతో పాటు… ముందుగానే ఏయే సమస్యలు వస్తాయనే విషయాన్ని అంచనా వేసి.. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి అని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమీక్షలో సీఎస్ సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.