Friday, 16 October 2026

హైడ్రాకు మద్దతుగా కొనసాగుతున్న ర్యాలీలు

newsseals-HYDRAA

హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. ఆక్ర‌మ‌ణ‌ల‌పై ఉక్కుపాదం మోపుతోంది. చెరువులు, పార్కులు , వాగులను పరిరక్షిస్తున్న HYDRAకు మద్దతుగా నగరం అంతటా ర్యాలీలు కొనసాగుతున్నాయి. హైడ్రాను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు తమ సంఘీభావాన్ని తెలియ జేస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా హైడ్రా వంటి వ్యవస్థను తీసుకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నగరంలోని అనేక కాలనీ సంక్షేమ సంఘాలు అండగా నిలుస్తున్నాయి. హైడ్రా వ్యవస్థను కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఐటీ కారిడార్ సమీపంలోని (నర్సింగి సరిహద్దు) గండిపేట మండలం పుప్పల్‌గూడలో 52.20 ఎకరాల విస్తీర్ణం కలిగిన చెరువు ఆక్రమణను అడ్డుకున్న హైడ్రాకు మద్దతుగా చుట్టుపక్కల కాలనీల వాసులు, గేటెడ్ కమ్యూనిటీలు , అపార్ట్‌మెంట్ నివాసితులు భారీ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించారు.

ముస్కిన్ చెరువులో సుమారు 35 ఎకరాలను ఆక్రమించేందుకు ప్రయత్నం జరిగినప్పుడు హైడ్రా ఆక్రమణలను తొలగించి చెరువు మొత్తాన్ని కాపాడింది. గచ్చిబౌలిలోని జనార్ధన్ హిల్స్ కాలనీలో ఆక్రమణకు గురైన వరద కాలువను, దానికి అనుసంధానించబడిన పార్కును కూడా హైడ్రా పరిరక్షించింది; దీనికి మద్దతుగా భారీ ర్యాలీ చేప‌ట్టారు. వృద్ధులు, మహిళలు, పిల్లలు , యువత పెద్ద సంఖ్యలో పాల్గొని హైడ్రాను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. నగరం భవిష్యత్తు బంగారు మయంగా మారాలంటే హైడ్రా తప్పక ఉండాలని వారు నినదించారు. వరదలు లేని నగరం కోసం చెరువులను కాపాడు కోవాలని, ఆ పనిని చేస్తున్న హైడ్రాకు తాము మద్దతు ఇస్తున్నామని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *