newsseals.com

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు జ‌న సైనికులు సిద్దం కావాలి

August 20, 2026 · VijayaBhaskar

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం , జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు జ‌న సైనికులు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. జన సైనికులు, వీర మహిళల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా వారి ఆత్మ గౌరవాన్ని నిలిపేలా స్థానిక సంస్థలు ముందుకు రానున్నాయ‌ని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ధైర్యంగా నిలిచిన జనసేన శ్రేణుల స్ఫూర్తిని కొన‌సాగించాల‌ని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల వ్యూహానికి భిన్నంగా స్థానిక ఎన్నికలలో జనసేనకు స్థానాలు కేటాయించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఇందుకు సంబంధించి తగిన విధివిధానాల రూపకల్పనకు పార్టీ నుంచి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

శాసన సభ పక్షం సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పార్టీ నేత‌లు, శ్రేణుల‌కు దిశా నిర్దేశం చేశారు. పార్టీ శ్రేణులు క్షేత్ర స్థాయిలో ఎంత ధైర్యంగా పోరాడతాయో అందరికీ తెలుసనీ, గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన స్థానిక ఎన్నికల్లో నిలబడ్డ తీరును ఎవరూ మరచిపోరని అన్నారు. ఆ రోజు నామినేషన్ వేసే పరిస్థితులు లేకుండా అప్పటి పాలకులు ప్రవర్తిస్తే వారిని ఎదిరించి పోటీకి నిలిచిన జనసేన నాయకులు, వీర మహిళల స్ఫూర్తిని ఎప్పుడూ విడిచిపెట్టబోమన్నారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో మున్సిపల్, పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. ప్రజా ప్రతినిధులు తెలియ చేసిన అంశాలను నోట్ చేసుకున్నారు డిప్యూటీ సీఎం. పార్టీ ఎమ్మెల్యేలు వారి నియోజక వర్గాలకే పరిమితం కాకుండా, వారి ప్రాంతంలో జనసేన బలబలాలను బేరీజు వేసి, మనం పోటీ చేసేందుకు తగిన స్థానాలను గుర్తించి పార్టీ కేంద్ర కార్యాలయానికి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు.

Related News