వాల్మీకిపురంలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం
తిరుపతి అన్నమయ్య జిల్లా : అన్నమయ్య తిరుపతి జిల్లాలో పేరు పొందిన , భక్తులు నిత్యం కొలిచే
వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. శ్రీరామ పట్టాభిషేక ఘట్టాన్ని కనులారా వీక్షించిన భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్ర నామార్చన నిర్వహించారు. అనంతరం యాగశాల పూజ, ఉదయం 6.30 గంటలకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంతో శ్రీపట్టాభి రామస్వామి, సీతమ్మవారి ఉత్సవ మూర్తులకు విశేష అభిషేకం నిర్వహించారు.
అనంతరం శాస్త్రోక్తంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్ సేవ అనంతరం శ్రీపట్టాభి రామస్వామి వారు గరుడ వాహనంపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు, ఆలయ అర్చకులు, సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా స్వామి వారి పట్టాభిషేకం సందర్బంగా టీటీడీ ఆద్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.