సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర హోం శాఖ ఝలక్
లండన్ : విదేశీ పర్యటనలో ఉన్న సీఎం ఎ. రేవంత్ రెడ్డికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బిగ్ షాక్ ఇచ్చింది. ఆయన బ్రిటన్ తో పాటు అమెరికా దేశాలలో కూడా పర్యటించాల్సి ఉంది. ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది. ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఇప్పటికే యూకేలో పర్యటనలో బిజీగా ఉంది. ఈ తరుణంలో సీఎం టీం అక్కడి నుంచి నేరుగా యుఎస్ కు వెళ్లాల్సి ఉండగా రాజకీయ కోణంలో అనుమతి నిరాకరించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. విధివిధానాలు, ప్రోటొకాల్ ప్రకారం ముఖ్యమంత్రి యూకే, అమెరికా పర్యటనకు రాష్ట్రం కేంద్ర అనుమతి కోరింది. తొలుత యూకే పర్యటనకు మాత్రమే అనుమతి లభించింది. అధికారిక ప్రతినిధి బృందం యూకేకు చేరుకున్న తర్వాత అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వడం లేదని స్పష్టం చేసింది.
తెలంగాణ అభివృద్ధి, విద్యా రంగ పురోగతికి, అలాగే వికసిత్ భారత్ నిర్మాణానికి తోడ్పడే ఈ పర్యటనకు రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించడం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కేంద్ర నిర్ణయాన్ని గౌరవిస్తూ లండన్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి రావాలని బోస్టన్, అమెరికా పర్యటనకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఈ పర్యటన ఉద్దేశం ఒక్కటే. కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా ప్రపంచంలోని ప్రఖ్యాత విద్యా సంస్థలను భారత్‌కు, తెలంగాణకు, హైదరాబాద్‌కు తీసుకురా వడం. అత్యుత్తమ ఐవీ లీగ్ విశ్వ విద్యాలయాలను, ప్రపంచంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థల నుంచి విద్య, నైపుణ్యాలు, శిక్షణ పొందాలన్న మన యువత ఆకాంక్షలకు ఇవి సమాధానంగా నిలిచేవి అని పేర్కొన్నారు.