22ఏ సమస్యల పరిష్కారం కోసం 1,162 కాల్స్
హైదరాబాద్ : 22ఏ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్‌కు ఇప్పటి వరకు 1,162 కాల్స్ వచ్చాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పీటెడ్, ఓవర్‌ల్యాప్ కాల్స్ తొలగించిన తర్వాత 980 ప్రత్యేక ఫిర్యాదులు ఉన్నాయని చెప్పారు. వీటిలో 547 వ్యవసాయ భూములు, 433 వ్యవసాయేతర భూములకు సంబంధించినవని అన్నారు. రంగారెడ్డి నుంచి 258, మేడ్చల్ నుంచి 149, సంగారెడ్డి నుంచి 82, కామారెడ్డి నుంచి 44, యాదాద్రి భువనగిరి నుంచి 40, సిద్దిపేట నుంచి 35 కాల్స్ వచ్చినట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 22ఎపై కొన్ని పత్రికల్లో వస్తున్నట్లుగా తీవ్ర సమస్య లేదని అన్నారు.
ఇప్పటికే రిలాక్సేషన్ పొందిన 22ఏ కేసుల్లో సుమారు 98 శాతం స్లాట్లకు రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు.సుమారు 300కు పైగా స్లాట్లలో దేవాదాయ, భూదాన్ తదితర కారణాలతో రిజిస్ట్రేషన్‌కు వీలు లేని 12–13 కేసులను మాత్రమే తిరస్కరించినట్లు చెప్పారు .రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోలేక పోయిన వారికి ఈ వారాంతంలోపు ఆ మొత్తాన్ని తిరిగి వారి ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. 22ఏకు సంబంధించిన నిజమైన సమస్యలను 24 గంటల్లో, అవసరమైన సందర్భాల్లో గరిష్ఠంగా 36 గంటల్లో పరిష్కరించేలా ఫాస్ట్‌ట్రాక్ విధానం అమలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.
ప్రజలను భయపెట్టడం మా ప్రభుత్వ విధానం కాదన్నారు.. ప్రజలకు భరోసా కల్పించడం మా బాధ్యత. ప్రభుత్వ భూములను కాపాడటం ఎంత ముఖ్యమో, న్యాయబద్ధమైన ప్రైవేట్ ఆస్తులకు రక్షణ కల్పించడం కూడా అంతే ముఖ్యం అని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ప్రతి ఫిర్యాదును పరిశీలిస్తాం.. ప్రతి రికార్డును ధృవీకరిస్తాం.. తప్పు జరిగితే సరిదిద్దుతాం.. అక్రమం జరిగితే చర్యలు తీసుకుంటాం. కానీ తప్పుడు ప్రచారంతో ప్రజలను భయాందోళనలకు గురి చేయడానికి మాత్రం ఈ ప్రభుత్వం అనుమతించదు అని అన్నారు.