Friday, 16 October 2026

గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన ఆయుష్, హెల్త్ యూనిట్లు

newsseals-APAyyush

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరోగ్య రంగంపై ప్ర‌త్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా భారీ ఎత్తున నిధులు తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌ధానంగా ఆయుష్ కింద పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా, గ్రామీణ ప్రజలకు కూడా తక్షణ వైద్య సేవలు అందించేలా యు. కొత్తపల్లి మండలం కొమరగిరిలో, గొల్లప్రోలు మండలం చేబ్రోలులో రూ.50 లక్షల చొప్పున వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇప్పటికే వంద శాతం పూర్తయి అందుబాటులోకి వచ్చాయి. వీటితోపాటు విరవాడలో రూ.30 లక్షలతో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆయుష్ డిస్పెన్సరీ పనులు చివరి దశకు చేరాయి. అదే సమయంలో పిఠాపురం నియోజకవర్గానికే పరిమితం కాకుండా కాకినాడ జిల్లా ప్రజలకు అత్యున్నత వైద్య సేవలు అందుబాటులోకి రావాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృషి చేస్తున్నారు.

ఆయన చొరవతో కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రూ.36.6 కోట్లతో అధునాతన క్యాన్సర్ చికిత్సా కేంద్రం ఏర్పాటు కానుంది. ఇందులో సీటీ సిమ్యులేటర్, హెచ్‌డీఆర్ బ్రాకీథెరపీ, డోసిమెట్రీ వంటి ఆధునిక పరికరాలతో పాటు, క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని కూడా అందుబాటులోకి తీసుకు రానున్నారు. గ్రామీణ స్థాయి ఆరోగ్య కేంద్రాల నుంచి అత్యాధునిక క్యాన్సర్ చికిత్స వరకు అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు చేరువయ్యేలా ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంతో పాటు కాకినాడ జిల్లా ప్రజల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న చర్యలు ప్రజారోగ్యంపై ఆయనకున్న ప్రత్యేక శ్రద్ధకు, కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *