Friday, 16 October 2026

ఏపీ మెగా డీఎస్సీలో ఎలాంటి అవినీతి జ‌ర‌గ‌లేదు : ఎండీ ఫ‌రూఖ్

newsseals-MDFarooq

అమ‌రావ‌తి : రాష్ట్ర న్యాయ‌, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎండీ ఫ‌రూఖ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశానికి మంత్రి వాసం శెట్టి సుభాష్ తో క‌లిసి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా జ‌గ‌న్ రెడ్డి చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో ఎలాంటి వాస్త‌వం లేద‌న్నారు. ఏపీ మెగా డీఎస్సీలో ఒక్క శాతం కూడా అవినీతి జరగలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతిని జరగనివ్వరని స్పష్టం చేశారు.క్రీడలకు ప్రాధాన్యం ఇస్తూ క్రీడా కోటాను 2 శాతం నుంచి 3 శాతానికి పెంచి ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. చదువుతో పాటు క్రీడల్లోనూ యువత రాణించాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 సర్వీసు పరీక్షల మూల్యాంకనంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని మంత్రి ఆరోపించారు. అర్హులైన అభ్యర్థుల భవిష్యత్తును దెబ్బతీసే విధంగా పేపర్ల మూల్యాంకనం జరిగిందని విమర్శించారు. గతంలో పరీక్షల మూల్యాంకన వ్యవస్థపై వచ్చిన ఆరోపణల వాస్తవాలు వెలుగులోకి వస్తున్నప్పటికీ, ఇప్పుడు డీఎస్సీపై ఇష్టానుసారం ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

దశాబ్దాల క్రితం శ్రీకారం చుట్టిన వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల 31న ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో రూ.2,250 కోట్లను ఖర్చు చేసిందని చెప్పారు. ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించడంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. మంచి పనులు చేయాలంటే రాజకీయాల్లో కూడా ప్రక్షాళన అవసరమని మంత్రి అన్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని తగ్గించే బాధ్యతను ప్రజలే తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలు రాజకీయ చెత్తను కూడా కడిగేయాలి. డబ్బు ప్రభావం లేకుండా ప్రజలు ఓటు వేసినప్పుడే రాజకీయాల్లో మార్పు వస్తుంది. ప్రజలు మంచి వారిని ఎన్నుకుంటే రాజకీయ నాయకులు కూడా తప్పులు చేయకుండా బాధ్యతగా పనిచేస్తారు అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *