newsseals.com

డేటా సెంటర్ల విషయంలో అపోహలు వద్దు

September 1, 2026 · VijayaBhaskar

విశాఖ‌పట్నం జిల్లా : రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత విశాఖపట్నానికి ఎంతో చేయాల్సిన బాధ్యత మనపై ఉంద‌న్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ దేశంలోనే తొలి వన్ ట్రిలియన్ డాలర్ల ఎకనామిక్ రీజియన్‌గా మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో విశాఖపట్నం అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని అన్నారు. ప్రజల ప్రయోజనాలకు, ప్రకృతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమం చేపట్టదని స్ప‌స్టం చేశారు నారా లోకేష్. అభివృద్ధి వేగంగా జరుగుతున్నప్పుడు వచ్చే అపోహలను తొలగించి ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు.

డేటా సెంటర్ల విషయంలో కూడా కొన్ని అపోహలు ఉన్నాయని, తాను వ్యక్తిగతంగా ఇంటెల్ డేటా సెంటర్‌ను పరిశీలించానని చెప్పారు లోకేష్. విశాఖలో ఏర్పాటు కానున్న డేటా సెంటర్ల విషయంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తాం అన్నారు. నీటి వినియోగాన్ని తగ్గించే ఎయిర్ కూలింగ్ వంటి సాంకేతికతలకు ప్ర‌యారిటీ ఉంటుంద‌న్నారు. విశాఖపట్నం వేగంగా రూపాంతరం చెందుతోంది. ఏఐజీ హాస్పిటల్‌కు శంకుస్థాపన చేసుకున్నాం. రెండేళ్లలో 650 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తవుతుంది. హైదరాబాద్‌ను చంద్రబాబు అభివృద్ధి చేసిన విధంగా విశాఖపట్నం అభివృద్ధిలో కూడా ఒక కొత్త బెంచ్‌మార్క్ సృష్టించ బోతున్నాం. విశాఖపట్నం నంబర్ వన్‌గా ఉండాలి. దేశంలోని మోడల్ సిటీల్లో ఒకటిగా విశాఖను అభివృద్ధి చేస్తాం అని ప్ర‌క‌టించారు నారా లోకేష్‌.

Related News