Saturday, 17 October 2026

రెండు వారాల్లో శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు

newsseals-AEO

తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో జరుగుతున్న ఇంజినీరింగ్‌ పనుల పురోగతిపై టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమలలోని సుధర్మ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమీక్షలో సివిల్‌, ఎలక్ట్రికల్‌, వాటర్‌ వర్క్స్‌ తదితర విభాగాలకు సంబంధించిన పనుల పురోగతిని పరిశీలించారు. టీటీడీ ఇన్‌చార్జి సీఈ మనోహరం ఇంజినీరింగ్‌ పనుల పురోగతిని అదనపు ఈవోకు వివరించారు. శ్రీవారి ఆలయం, మాడ వీధులు, గ్యాలరీల్లో వైట్‌వాషింగ్‌, పెయింటింగ్‌, బారికేడింగ్‌, మరమ్మతులు, అభివృద్ధి పనులు, పుష్కరిణి గ్రిల్స్‌ పునరుద్ధరణ, వాహనాల ఫిట్‌నెస్‌, వివిధ డ్యామ్‌లలో నీటి నిల్వల స్థాయి, విద్యుత్‌ అలంకరణ, వివిధ విశ్రాంతి భవనాల్లో ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ తదితర పనులు దాదాపు పూర్తయ్యాయని, మరికొన్ని పనులు తుది దశలో ఉన్నాయని తెలిపారు.

బ్రహ్మోత్సవాల నాటికి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సివిల్‌ ఇంజినీరింగ్‌ పనులన్నింటినీ వారం రోజుల్లోగా పూర్తి చేయాలని అదనపు ఈవో అధికారులను ఆదేశించారు. అనంతరం వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న శ్రీ వేంకటేశ్వర మ్యూజియానికి సంబంధించిన పనుల పురోగతిని కూడా అదనపు ఈవో సమీక్షించారు. ఈ సమావేశంలో ఎస్‌ఈలు వేణుగోపాల్‌, వెంకటేశ్వర్లు, ఈఈలు శ్రీనివాసులు, సుధాకర్‌, డిఈ చంద్రశేఖర్‌ తదితర ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *