2027లో భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్
న్యూఢిల్లీ : కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 2027 నుండి భారత్ NCAP 2.0 అమలులోకి రానుంది అని వెల్లడించారు. 2013లో ప్రారంభమైన ‘భారత్ NCAP’ (భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) అనేది భారతదేశపు అధికారిక , స్వతంత్ర వాహన భద్రతా రేటింగ్ వ్యవస్థ. ఇది ప్యాసింజర్ కార్లను ‘క్రాష్-టెస్ట్’ (ఢీకొనే పరీక్షలు) చేసి, వాటికి 1 నుండి 5 వరకు స్టార్ రేటింగ్‌లను కేటాయిస్తుంది. ప్రమాదాలు జరిగినప్పుడు ఈ కార్లు పెద్దలను , పిల్లలను ఎంత సమర్థవంతంగా రక్షిస్తాయో ఇది అంచనా వేస్తుంది. అక్టోబర్ 2027 నుండి ‘భారత్ NCAP 2’ను అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. ఇది సమగ్ర భద్రతా విధానాన్ని అంచనా వేయడంతో పాటు, దేశంలో తీవ్ర సమస్యగా ఉన్న రోడ్డు ప్రమాదాల సవాలును పరిష్కరించడంలో సహాయ పడుతుందన్నారు. 66వ SIAM వార్షిక సదస్సు (2025)లో ప్రసంగిస్తూ మంత్రి భారత్ NCAP సాధించిన విజయాన్ని వివరించారు.
ప్రమాదాల సమయంలో ప్రయాణికుల రక్షణ సామర్థ్యాన్ని ఇది అంచనా వేస్తుందన్నారు. భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సమస్య తీవ్రతను ప్రస్తావిస్తూ గడ్కరీ ఇలా అన్నారు. మేము భారత్ NCAP 2తో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం, దీనిలో అక్టోబర్ 2027 నుండి మొత్తం భద్రతా వ్యవస్థ (సేఫ్టీ చైన్) అంచనా వేయబడుతుంది. ఇది చాలా కీలకం ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు ఒక పెద్ద సమస్య. ఈ విషయంలో మనం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నామని అన్నారు . ప్రపంచ వ్యాప్తంగా NCAP కింద అయ్యే ఖర్చుతో (సుమారు రూ. 2.5 కోట్లు) పోలిస్తే, భారతదేశంలో వాహన పరీక్షలకు అయ్యే సమయం, ఖర్చు చాలా తక్కువ. భారతదేశంలో ప్రతి సంవత్సరం 1,80,000 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని మంత్రి వెల్లడించారు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, దేశంలో రోడ్డు ప్రమాదాలు ,మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉందని గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు.