రాములమ్మకు మంత్రివర్గంలో చోటు..?
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా బీసీ సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించారు. ఈ మేరకు ముగ్గురు మహిళలకు కీలక పదవులు కట్టబెట్టారు. తాజాగా కొండాను తప్పించడంతో ఖాళీ అయిన స్థానాన్ని మరో దమ్మున్న మహిళా లీడర్ కు ఛాన్స్ ఇవ్వాలని ఏఐసీసీ ప్లాన్ చేస్తున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సురేఖపై చర్యలు తీసుకునే ప్రక్రియ కొనసాగుతుండటంతో అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు, కొన్ని నిర్దిష్ట సూచనలు కూడా జారీ చేసినట్లు సమాచారం.
ఢిల్లీలో సుదీర్ఘ మంతనాల అనంతరం సురేఖ వ్యవహారంపై దృష్టి సారిస్తూనే ఏకంగా ముగ్గురు మహిళలకు పదవులు కల్పించే దిశగా అడుగులు పడ్డాయి. ఇదే సమయంలో, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఎమ్మెల్సీ విజయశాంతికి మంత్రి పదవిని ఇచ్చి ఆమె సేవలను వినియోగించు కోవాలని రాష్ట్ర నాయకత్వానికి అధిష్టానం సూచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే, కొండా సురేఖ పార్టీని వీడి రేపే కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించే అవకాశం ఉన్నందున… ఆమెను ఎదుర్కోవడానికి విజయశాంతికి ప్రాధాన్యత కల్పించి బలోపేతం చేయాలని పార్టీ భావిస్తోంది.