Friday, 6 November 2026

జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడంలో చిత్తశుద్ది లేదు

newsseals-TWJF

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై ఎలాంటి సానుకూల నిర్ణయం తీసుకోక పోవడం అత్యంత దురదృష్టకరమని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్ళు కావస్తుందని, ఇప్పటి వరకు 25 కు పైగా కేబినెట్ సమావేశాలు జరిగాయని, అయినా ఏ ఒక్క సమావేశంలో జర్నలిస్టుల ఇళ్ళస్థలాల సమస్య పై చర్చ జరగలేదని అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా జర్నలిస్టులకు ఇళ్ళస్థలాలు ఇచ్చే విషయంలో చిత్తశుద్ది లేనట్లు కనిపిస్తుందని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, తన ఎన్నికల మేనిఫెస్టోలో ఐదు ప్రధాన హామీలను 27వ అంశంగా పొందుపర్చిందని సోమయ్య గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఆ హామీల్లో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు.

జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు, సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం, అర్హులైన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు జిల్లాల వారీగా ఇళ్ల స్థలాల కేటాయింపు, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం, రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. అలాగే జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు హెల్త్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించినప్పటికీ ఆచరణలో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించడం లేదని అన్నారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, గతంలో ఉన్న సౌకర్యాలను సైతం ప్రభుత్వం తగ్గిస్తోందని సోమయ్య ఆరోపించారు. చిన్న, మధ్యతరహా పత్రికలు, పీరియాడికల్స్‌కు ప్రభుత్వ ప్రకటనలు నిలిపి వేయడంతో పాటు రెండేళ్లుగా ప్రకటనల బకాయిలు చెల్లించక పోవడం ఆ సంస్థల మనుగడకు ఇబ్బందిగా మారిందన్నారు.

రాష్ట్రంలో 44 వేలకు పైగా అక్రిడిటేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం, కేబుల్ ఛానళ్లకు గతంలో ఉన్న కార్డుల్లో సగం తగ్గించిందని ఆరోపించారు. ఐపీ నెట్‌వర్క్ పేరుతో అనేక కేబుల్ ఛానళ్లకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న తరహాలోనే జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించేలా హెల్త్ కార్డులు జారీ చేయాలని కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని సోమయ్య ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రస్తుతం అందిస్తున్న పాత హెల్త్ కార్డులు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో సక్రమంగా పని చేయడం లేదని, దీంతో జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *