కొండా సురేఖ కొత్త పార్టీపై సంకేతాలు..?
వరంగల్ జిల్లా : కాంగ్రెస్ పార్టీ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ కు గురైన కొండా సురేఖ కొత్త పార్టీ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారా..అవుననే సమాధానం వినిపిస్తోంది. నిన్న రాష్ట్ర మంత్రివర్గం నుండి దేవాదాయ , అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తొలగించబడ్డారు. “ఎదురుచూపులు దాదాపు ముగిశాయి” అని పేర్కొంటూ కొండా సురేఖ ఫేస్‌బుక్‌లో ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. త్వరలోనే ఒక పెద్ద ప్రకటన రాబోతోందని పేర్కొన్నారు మాజీ మంత్రి . తెలంగాణ ప్రజలారా కొంతకాలం వేచి చూడండి (Stay Tuned, Telangana) అని ఆమె రాశారు. తాజాగా రాష్ట్ర మంత్రివర్గం నుండి తొలగింపునకు గురి కావడం చర్చకు దారితీసేలా చేసింది.
తను రాజకీయాలలో 30 ఏళ్ల పాటు ఉన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొండా సురేఖ, గతంలో రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఆమె తదుపరి రాజకీయ అడుగుపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. సురేఖ కొత్త రాజకీయ పార్టీని స్థాపించే ఆలోచనలో ఉండవచ్చని కొన్ని వార్తలు చెబుతుండగా, మరికొందరు ఆమె త్వరలో బీజేపీలో చేరవచ్చని పేర్కొంటున్నారు. ఆమె చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ఊహాగానాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే, తన భవిష్యత్తు రాజకీయ ప్రణాళికల గురించి కొండా సురేఖ నుండి ఎటువంటి అధికారిక ధృవీకరణ రాలేదు. ఆమె ఫేస్‌బుక్ పోస్ట్ ఆసక్తిని మరింత పెంచింది; రాజకీయ వర్గాలు ఆమె తదుపరి అడుగును నిశితంగా గమనిస్తున్నాయి.