newsseals.com

టీటీడీ ఆల‌యాల్లో ఘ‌నంగా ఉట్లోత్స‌వం

September 6, 2026 · VijayaBhaskar

తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ఆధ్వ‌ర్యంలోని ఆల‌యాల్లో శ్రీ‌ కృష్ణ‌జ‌న్మాష్ట‌మి వేడుక‌లు అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రిగాయి. ఉత్సవాల‌లో భాగంగా తిరుమలలో ఉట్లోత్సవం అత్యంత వేడుక‌గా జరిగింది. శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించిన మరునాడు ఉట్లోత్సవాన్ని (శిక్యోత్సవం) నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది శ్రీ మలయప్ప స్వామి వారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణ స్వామి మరో తిరుచ్చిపై తిరు వీధులలో ఊరేగుతూ ప‌లు ప్రాంతాల్లో ఉట్లోత్సవాన్ని తిలకించారు.

ముందుగా శ్రీమలయప్పస్వామివారు, శ్రీకృష్ణస్వామివారి ఉత్సవ మూర్తుల‌ను ఊరేగింపుగా శ్రీ పెద్దజీయర్‌ మఠానికి వేంచేపు చేశారు. అక్కడ ఆస్థానం చేపట్టారు. ఆ తరువాత శ్రీ‌వారి ఆల‌యం ఎదుట ఉట్లోత్స‌వం ఉత్సాహంగా జ‌రిగింది. సాయంత్రం నుండి రాత్రి వరకు ఆద్యంతం కోలాహలంగా పలు ప్రాంతాల్లో సాగిన ఈ ఉట్లోత్సవంలో స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ అనుబంధ ఆలయమైన శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.

శ్రీకృష్ణ పరమాత్మను స్మరిస్తూ ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి సహస్ర నామార్చన చేపట్టారు. అనంతరం మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శ్రీకృష్ణస్వామి వారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించి, అనంతరం ఊంజల్‌సేవ చేపట్టారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఉట్లోత్సవం, ఆస్థానం వేడుకలను వైభవంగా నిర్వహించారు.

శ్రీకృష్ణుని బాలలీలలను స్మరింపజేసే ఉట్లోత్సవాన్ని భక్తులు భక్తిప్రపత్తులతో వీక్షించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

Related News