హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జజు, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి. అజిత్ రెడ్డితో కలిసి బేగంపేట నుండి ప్యారడైజ్ వరకు హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణం చేశారు. ఈ ప్రయాణంలో ప్రధాన కార్యదర్శి అధికారులు , ప్రయాణికులతో ముచ్చటించారు. అనంతరం మెట్రో వ్యవస్థ పనితీరును సమీక్షించారు. ఆయన మెట్రో స్టేషన్లలోని వాణిజ్య సముదాయాలను, పార్కింగ్ సౌకర్యాలను తనిఖీ చేసి, వాటి మరింత అభివృద్ధికి సూచనలు అందించారు.
ఎన్‌హెచ్-44 వెంబడి హెచ్‌ఎండిఏ నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్లను కూడా తనిఖీ చేసి, కొనసాగుతున్న పట్టణ మౌలిక సదుపాయాల పనులను సమీక్షించారు . ప్రధాన కార్యదర్శి మెట్రో ప్రయాణం ఒక ప్రయాణికుడి దృక్కోణం నుండి ప్రజా రవాణా , పట్టణ మౌలిక సదుపాయాలను అర్థం చేసుకోవడానికి తను తీసుకున్న ప్రత్యక్ష విధానాన్ని ప్రతిబింబించింది. ఈ సందర్బంగా పలు కీలక సూచనలు చేశారు సీఎస్. ఇప్పటికే మెట్రో రైలు నిర్వహణ నుండి ప్రైవేట్ సంస్థ తప్పుకుంది. దీంతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచనల మేరకు మెట్రో నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే చూసుకుంటుందని ప్రకటించారు.





