అమరావతి : ప్రతి నెలా ఆర్దిక నివేదికను విడుదల చేసి ఎప్పటికప్పుడు లక్ష్యాలను బేరీజు వేసుకుంటున్నాం అని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రతి మూడు నెలలకూ జీఎస్డీపీని కూడా లెక్కించి ప్రగతిలో ఎక్కడ ఉన్నామో చూస్తున్నాం. 2022-23 బేస్ ఇయర్ గా ప్రస్తుత ధరలకు అనుగుణంగా 13.44 శాతం వృద్ధి రేటు నమోదు కాగా తయారీ రంగంలోనూ అభివృద్ధి నమోదు అయ్యిందని అన్నారు.. జీఎస్టీ వసూళ్లు కూడా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.25,450 కోట్ల మేర పెరిగాయని చెప్పారు. రెవెన్యూ శాఖలో సంస్కరణల్ని అమలు చేస్తున్నాం అన్నారు. 120 ఏళ్ల నాటి భూ సమస్యల్ని కూడా పరిష్కరిస్తున్నాం అని పేర్కొన్నారు. 1908 నుంచి అమలాపురంలో గ్రౌండ్ రెంట్ భూముల విషయంలో నిర్ణయం తీసుకుని 1,416 మందికి పట్టాలు ఇచ్చామని చెప్పారు. 2027 నాటికి భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేసే బాధ్యత మనందరిపై ఉందన్నారు సీఎం.
పాలన అంటే గుడ్డిగా పని చేయటం కాదు. వినూత్న ఆలోచనలు చేయాలి. బెస్ట్ ప్రాక్టీసెస్ అనుసరించాలి. బెస్ట్ పాలసీలు తెచ్చి ప్రభుత్వ సేవలను సులభతరం చేయాలని అన్నారు. కొత్త ఆలోచన- కొత్త ఆవిష్కరణలతో అంతా కలిసి పనిచేద్దాం అని పిలుపునిచ్చారు. ప్రస్తుతం 13.44 శాతం వృద్ధి నమోదైంది. దీనిని 15 శాతం దిశగా తీసుకెళ్దా అని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. కొందరు వ్యక్తులు ఫేక్ ప్రచారంతో సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. వేగంగా స్పందిస్తే దానికి కౌంటర్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. సరైన సమయంలో స్పందించ కపోతే ఆ శిక్ష ప్రభుత్వానికి పడుతుంది. కొందరు రాజకీయాలు చేస్తూ తప్పు దోవ పట్టించే ప్రయత్నం జరుగుతోంది. డీఎస్సీ-2025లో ఎక్కడా తప్పు జరగలేదు. స్పోర్ట్స్ కోటాలో నిబంధనల ప్రకారమే ఉద్యోగాలిచ్చాం. కానీ కొందరు అదే పనిగా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు.
దీనిపై ఇద్దరు మహిళా అధికారులు చక్కగా స్పందించి కౌంటర్ ఇచ్చారు. వారిని అభినందిస్తున్నా. ఉద్యోగాలు వచ్చిన ఉపాధ్యాయులు కొండారెడ్డి బురుజు, విజయవాడ అంబేద్కర్ విగ్రహం, విశాఖ బీచ్ రోడ్డులో ఆరోపణలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. దుష్ప్రచారం ఆపకపోతే వారి పార్టీని బంగాళా ఖాతంలో కలుపుతామని నినదించారు. గత ప్రభుత్వం నిర్వాకంతో మార్కెట్టులోకి వచ్చిన జే బ్రాండ్ మద్యం వల్ల 30 వేల మంది చనిపోయారు. వారి ఆరోగ్యం కూడా దెబ్బతింది. కల్తీ బ్రాండ్లన్నీ రద్దు చేసి పారదర్శకంగా విక్రయాలు జరిగేలా చూస్తున్నాం. విద్యుత్ టారిఫ్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ పంపిణీ చేస్తున్నాం అన్నారు.





