newsseals.com

17న ప్ర‌ధాని కోసం ఇంటి ముందు దీపం వెలిగించాలి

September 13, 2026 · VijayaBhaskar

అమ‌రావ‌తి : ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధ‌వ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్ర ప్రజలు ఈనెల 17వ తేదీ రాత్రి 7గం లకు ప్రధానమంత్రి న‌రేంద్ర మోదీని ఆశీర్వదిస్తూ ఇంటి ముందు దీపం వెలిగిద్దాం అని పిలుపునిచ్చారు. మోదీ దేశ సేవకు అంకితమై 25 సంవత్సరాల ప్రజాసేవా ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా ‘సేవా సంకల్ప అభియాన్’ నిర్వహిస్తున్నాం అని ప్ర‌క‌టించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు ఈ సేవా సంకల్ప అభియాన్ కొనసాగుతుందని వెల్ల‌డించారు పీవీఎన్ మాధ‌వ్. 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, అనంతరం ప్రధానమంత్రిగా దేశానికి ఆయన అందించిన సేవలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు .

నరేంద్ర మోదీ జీవితమే దేశ సేవకు, సమాజ సేవకు అంకితం అయ్యార‌ని, కోట్లాది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో ఆయన నిరంతరం పని చేస్తున్నారని చెప్పారు. మోదీకి ఆయురారోగ్యాలు, సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, మరింత శక్తి కలగాలని మనమంతా భగవంతుడిని ప్రార్థించాలని కోరారు పీవీఎన్ మాధ‌వ్. సెప్టెంబర్ 17న రాత్రి 7 గంటలకు ప్రతి ఇంటా ‘ఆశీర్వాద దీపం’ వెలిగిద్దాం అన్నారు. మోదీకి యశస్సు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిద్దాం. ఈ దీప ప్రజ్వలన కార్యక్రమం సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహించ బడుతోంద‌న్నారు. ప్రతి బీజేపీ కార్యకర్త తన ఇంటితో పాటు ప్రజలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని స్ప‌ష్టం చేశారు పీవీఎన్ మాధ‌వ్.

Related News