newsseals.com

తిరుమలకు ప్రైవేటు వాహనాలపై ఎలాంటి ఆంక్షలు లేవు

September 16, 2026 · VijayaBhaskar

తిరుమల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఇవాల కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. కొంద‌రు కావాల‌ని టీటీడీ ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించేలా సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు, నిరాధార‌మైన వార్త‌ల‌ను ప్ర‌చురించ‌డం చేస్తున్నార‌ని ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొంది. తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు, రోజుకు 15,000 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఆ తరువాత వచ్చే వాహనాలను చెక్ పాయింట్ల వద్ద నిలిపి వేస్తారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం త‌మ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఇది పూర్తిగా నిరాధారం, అవాస్త‌వ‌మ‌ని స్ప‌ష్టం చేసింది. ఇలాంటి వార్త‌ల‌ను భ‌క్తులు న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరింది.

ఇది పూర్తిగా అవాస్తవం అని ఖండించింది టీటీడీ. తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాల సంఖ్యపై ఈ తరహా ఎలాంటి నిర్ణయాన్ని టీటీడీ తీసుకోలేదని ప్ర‌క‌టించింది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తను భక్తులు నమ్మవద్దని మరోసారి విన్న‌వించింది. ప్ర‌స్తుతం శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయ‌ని, భ‌క్తులు వేలాదిగా త‌ర‌లి వ‌స్తున్నార‌ని, ఎవ‌రినీ ఇప్ప‌టి వ‌ర‌కు ఇబ్బంది పెట్ట‌లేద‌ని తెలిపింది. ఏ ఒక్క వాహ‌నాన్ని ఆప‌లేద‌ని వెల్ల‌డించింది. ఒక‌వేళ ఎలాంటి స‌మాచార‌మైనా టీటీడీకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు, సమాచారం అధికారిక టీటీడీ ప్రకటనల ద్వారా మాత్రమే తెలియ జేయబడతాయని తెలిపింది. వాస్తవాలను నిర్ధారించు కోకుండా ఇలాంటి అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేయడం ద్వారా భక్తులను అయోమయానికి గురి చేయడం సరికాదని హిత‌వు ప‌లికింది.

టీటీడీ పేరుతో తప్పుడు వార్తలు, అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది.

Related News