newsseals.com

నా జీవితం తెరిచిన పుస్త‌కం : హ‌రీష్ రావు

September 18, 2026 · VijayaBhaskar

సిద్దిపేట : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం సిద్దిపేట‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌న జీవితం తెరిచిన పుస్త‌కం అని అన్నారు. ఎవ‌రు ఎన్ని ఆరోప‌ణ‌లు చేసినా తాను ఏమీ భ‌య‌ప‌డ‌న‌ని అన్నారు. త‌ప్పు చేసిన వాళ్లు త‌న గురించి మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌న్నారు. శాస‌న స‌భ వేదిక‌గా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ , త‌న ఫ్యామిలీ గురించి అబ‌ద్దాలు మాట్లాడార‌ని ఆరోపించారు. తాను ఎలాంటి అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌లేద‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే కొనుగోలు చేసిన ఆస్తులు, పొలాల‌కు సంబంధించిన ప‌త్రాలు భ‌ద్రంగా ఉన్నాయ‌ని చెప్పారు. కావాలంటే చెక్ చేసుకోవ‌చ్చ‌ని హిత‌వు ప‌లికారు. వందల మంది పోలీసులు, బుల్లెట్ ప్రూఫ్ బండ్లు. రోప్ పార్టీలు ఎందుక‌ని ప్ర‌శ్నించారు హ‌రీశ్ రావు.

డ్రోన్లు పెట్టీ ఫోటోలు తీయడం ఎందుకని నిల‌దీశారు. తాను ఇక్క‌డే ఉన్నాన‌ని, త‌న‌కు చెబితే అన్ని ఏర్పాట్లు ద‌గ్గ‌రుండి చేస్తాన‌ని చెప్పారు. మంచిగ కడుపు నిండ అన్నం తినిపించి , మీకు ఏం కావాలో అన్నీ చూపిస్తాన‌ని అన్నారు. కాకుంటే ఉన్నది ఉన్నట్లు చెప్పండి. అబద్ధాలు చెప్పకండి అని సూచించారు మాజీ మంత్రి. అన్నింటి గురించి ఎన్నికల అఫిడవిట్లలో నా భూములు, ఆస్తుల వివరాలు సుస్పష్టంగా చెప్పాన‌న్నారు. సర్వే నెంబర్లతో సహా భూముల వివరాలు ఇచ్చాన‌ని తెలిపారు హ‌రీశ్ రావు. మీ లాగా నేను కబ్జాలు పెట్టలేదు, ప్రజల సొమ్ము దోచుకోలేదని ధ్వజ‌మెత్తారు. సిద్దిపేట ప్రజలు నా పని చూసి ఏడు సార్లు గెలిపించారు. నన్ను దీవించారని అన్నారు.

Related News