జీహెచ్ఎంసీ కార్మికులకు అండగా ఉంటా : తీన్మార్ మల్లన్న
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ)లో పని చేస్తున్న కార్మికులకు భరోసా ఇచ్చారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఆయన తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యాధికార యాత్రను చేపట్టారు. ఇందులో భాగంగా తీన్మార్ మల్లన్నను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు GHMC కార్మికులు .ఏజెన్సీ వ్యవస్థల వల్ల తమ శ్రమ దోపిడీకి గురవుతోందని వాపోయారు. పనికి తగిన వేతనం అందడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి తమను పర్మినెంట్ చేయాలని కోరారు. గత కెసిఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా తమ సమస్యలను పరిష్కరించడం లేదని వాపోయారు.
కార్మికుల సమస్యలను విన్న మల్లన్న.. “మీకు పూర్తిగా అండగా ఉంటా.. ఏజెన్సీ వ్యవస్థ రద్దు కోసం మీ తరఫున పోరాడతా” అని భరోసా ఇచ్చారు. ఏ ప్రభుత్వం వచ్చిన బీసీల బతుకులు బాగు పడడం లేదని వాపోయారు మల్లన్న. అందుకే తాను బీసీ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించడం లేదని మండిపడ్డారు. వాళ్లకు తమ స్వప్రయోజనాలు తప్పా ఇంకేవీ గుర్తుకు రావడం లేదన్నారు. రాబోయే రోజుల్లో బీసీలు తమ సత్తా ఏమిటో చూపిస్తారని హెచ్చరించారు తీన్మార్ మల్లన్న.