కనుల పండువగా సాంస్కృతిక ప్రదర్శనలు

తిరుమల : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రుగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా నిన్న‌ రాత్రి సర్వ భూపాల వాహన సేవలో దేశంలోని వివిధ ప్రాంతాల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా 9 రాష్ట్రాల నుంచి 20 కళా బృందాలకు చెందిన 527 మంది కళాకారులు పాల్గొన్నారు. గాన, వాద్య, నృత్య ప్రదర్శనలతో శ్రీవారిని కీర్తిస్తూ వాహన సేవకు మరింత శోభను చేకూర్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, కేరళ, పంజాబ్, ఒడిశా, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన కళా బృందాలు తమ సంప్రదాయ కళా రూపాలను ప్రదర్శించాయి.

సర్వభూపాల వాహన సేవలో భరతనాట్యం, కూచిపూడి, మోహినీయట్టం, ఒడిస్సీ, కథక్, పేరిణి శివతాండవం, మణిపురి తదితర శాస్త్రీయ నృత్యరూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కళాకారులు తమ అద్భుతమైన నృత్యాభినయంతో భారతీయ శాస్త్రీయ కళా వైభవాన్ని ఆవిష్కరించారు. భాంగ్రా, కోలాటం, లెజిమ్, నౌర్టా, బస్తర్ గిరిజన నృత్యం వంటి జానపద, గిరిజన కళారూపాలతో పాటు నవదుర్గ నృత్యం, దశావతార రూపకం, శ్రీకృష్ణ లీలలు తదితర ప్రదర్శనలు భక్తులను విశేషంగా అలరించాయి. మహారాష్ట్రకు చెందిన డ్రమ్స్, లెజిమ్ విన్యాసాలు, కేరళ డ్రమ్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ వాయిద్యాల లయబద్ధమైన విన్యాసాలతో తిరుమాడ వీధులు మార్మోగాయి.

వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన కళాకారులు తమ ప్రాంతీయ సంప్రదాయాలు, జానపద కళలు, శాస్త్రీయ నృత్యాలను శ్రీవారి వాహన సేవలో ప్రదర్శించడంతో తిరుమలలో భారతీయ కళా, సాంస్కృతిక వైవిధ్యం ఆవిష్కృతమైంది. గాన, వాద్య, నృత్య కళారూపాల సమ్మేళనంతో సర్వభూపాల వాహన సేవ కనుల పండువగా సాగింది. స్వామివారి దివ్య దర్శనంతో పాటు వివిధ రాష్ట్రాల కళా వైభవాన్ని వీక్షించిన భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని, సాంస్కృతిక అనుభూతిని ఏకకాలంలో పొందారు.

  • Related Posts

    ఆకట్టుకున్న రాజస్థాన్‌ ఘూమర్‌ నృత్యం

    తిరుమల : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం జరిగిన కల్పవృక్ష వాహన సేవలో వివిధ రాష్ట్రాల కళాకారులు ప్రదర్శించిన సంప్రదాయ కళారూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సాంస్కృతిక…

    గోవుల గోపన్న అలంకారంలో శ్రీ మలయప్ప

    తిరుమల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ధ‌ర్మ‌క‌ర్త‌లి మండ‌లి (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో తిరుమ‌ల‌లో చేప‌ట్టిన శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభోపేతంగా కొన‌సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారు కల్పవృక్ష వాహనంపై…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *