టీచర్లపై దాడి ప్రజాస్వామ్యానికి మచ్చ : బోండా ఉమ
విజయవాడ : ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కూటమి పాలనను అస్థిర పరిచేందుకు వైసీపీ ఆధ్వర్యంలో కుట్రలకు తెర లేపారని మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్ కు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. స్వార్ధ రాజకీయాలు డైవర్షన్ పాలిటిక్స్ కోసం ప్రజల పై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం పాపాలు, అవినీతి ఒక్కొక్కటిగా ఆధారాలతో బయటకు వస్తుండటం ఓర్వలేక రాక్షస క్రీడకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న విజయవాడ నగరాన్ని రావణకాష్టం చేయాలని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. నిన్న మా నాయకుడు మా చేతులు కట్టేయకుంటే ఒక్క వైసీపీ నేత తిరిగి వెళ్ళేవాళ్లు కాదన్నారు.
వైసీపీ వికృత చేష్టలకు మాతో పాటు, ప్రజాల్లోనూ సహనం నసిస్తోందని అన్నారు బోండా ఉమామహేశ్వర్ రావు. కోడిగుడ్లు, మారణాయుధాలతో ప్రధాన రహదారిపై వైసీపీ గూండాలు వస్తే పోలీసులు సైతం ప్రేక్షకపాత్ర పోషించటం దురదృష్టం అన్నారు. రౌడీషీటర్లు అంతా నిన్న విజయవాడ శాప్ కార్యాలయం మీద దాడికి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న వచ్చిన వైసీపీ నేతలందరిపైనా పోలీసులు కేసులు పెట్టి అరెస్టు చేయాల్సిందేనని అన్నారు. పోలీసులు ఇంకా మీనమేషాలు లెక్కిస్తే విజయవాడ అరాచకం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వ విప్. ఇది అమరావతి బ్రాండ్ ఇమేజ్ కు కూడా ఇబ్బందేనని పేర్కొన్నారు. పోలీసులు ఉక్కుపాదం మోపకుంటే అమరావతి ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని అన్నారు.