newsseals.com

అశ్వ వాహన సేవలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

September 23, 2026 · VijayaBhaskar

తిరుమల : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి వాహన సేవగా జరిగిన అశ్వ వాహన సేవలో వివిధ రాష్ట్రాల కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాకారుల కళారూపాలతో తిరుమాడ వీధులు భక్తిభావంతో, ఆధ్యాత్మిక సందడితో కళకళలాడాయి. శ్రీవారి వాహన సేవను వీక్షించేందుకు తరలివచ్చిన భక్తులను అలరిస్తూ కళాకారులు కోలాటం, చెక్కభజనలు, కర్రసాము, తప్పెటగుళ్లు, డప్పు వాయిద్యాలు, భరతనాట్యం తదితర జానపద, శాస్త్రీయ కళారూపాలను ప్రదర్శించారు. సంప్రదాయ జానపద కళలతోపాటు శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తిరుమాడ వీధుల్లో కళాబృందాలు ఉత్సాహ భరితంగా ప్రదర్శనలు ఇస్తుండగా భక్తులు ఆసక్తిగా తిలకించారు. కళాకారుల నృత్యాలు, వాయిద్యాల నాదాలు వాహన సేవకు మరింత శోభను చేకూర్చాయి. భక్తి, కళ, సంస్కృతి సమ్మేళనంతో తిరుమాడ వీధులు ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకున్నాయి. ఈ వాహనసేవలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, సిక్కిం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 21 కళాబృందాలకు చెందిన 539 మంది కళాకారులు పాల్గొని తమ కళా ప్రదర్శనలతో భక్తులను అలరించారు.

Related News