శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతం
తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అర్చక స్వాములు, అధికారులు, ఉద్యోగులు, జిల్లా, పోలీసు యంత్రాంగం, శ్రీవారి సేవకులు, మీడియా ప్రతినిధులు, భక్తుల సమిష్టి కృషితో విజయవంతంగా నిర్వహించామని టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు తెలిపారు. బుధవారం తిరుమల అన్నమయ్య భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రతో కలిసి చైర్మన్ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముఖ్యాంశాలను వివరించారు.సెప్టెంబరు 15 నుంచి 22వ తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ప్రపంచం నలుమూలల నుంచి తరలి వచ్చిన భక్తులకు వాహన సేవలతో పాటు శ్రీవారి మూలమూర్తి దర్శనం కల్పించినట్లు తెలిపారు.
బ్రహ్మోత్సవాల మొదటి రోజైన సెప్టెంబరు 15న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారని, ఈ సందర్భంగా 2027 సంవత్సరానికి సంబంధించిన టీటీడీ డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించారని తెలిపారు. ఎనిమిది రోజుల బ్రహ్మోత్సవాల్లో మొత్తం 5.76 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారన్నారు.రూ.28.94 కోట్ల హుండీ కానుకలు లభించాయని, 21.84 లక్షల అన్న ప్రసాదాలు పంపిణీ చేసినట్లు తెలిపారు చైర్మన్. 2.04 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని, 33 లక్షల లడ్డూలు విక్రయించామన్నారు.
ఏపీఎస్‌ఆర్టీసీ ద్వారా తిరుపతి నుంచి తిరుమలకు 13,671 ట్రిప్పుల్లో 3,92,106 మంది, తిరుమల నుంచి తిరుపతికి 13,584 ట్రిప్పుల్లో 4,97,195 మంది భక్తులు ప్రయాణించినట్లు వెల్లడించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన గరుడసేవ రోజున తిరుమలకు విచ్చేసిన భక్తులందరికీ దర్శనం కల్పించామని చైర్మన్ తెలిపారు. టీటీడీ కల్పించిన ఏర్పాట్లపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో పునరుద్ధరించిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో హీలింగ్ అండ్ డివోషన్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, దుర్లభ్ దర్శన్ వీఆర్ అనుభవం, ఎలక్ట్రిక్ బస్సులు, నందకం యాప్, భక్తుల కోసం గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాలను ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే మాస్టర్ ప్లాన్‌లో భాగంగా రూ.90 కోట్లతో తిరుచానూరు ఆలయానికి ఉన్న రోడ్లను అనుసంధానం చేసేందుకు చర్యలు చేపట్టాం అన్నారు.