లోతట్టు ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలి
అమరావతి : తీవ్ర వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజులుగా కాకినాడ జిల్లావ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు కురుస్తుండడంతో యంత్రాంగం మరో రెండు రోజుల పాటు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు లోతట్టు ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అన్నారు. వరద ముంపు ఉన్న ప్రాంతాల ప్రజల్ని అవసరం అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచనలు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో కాకినాడ జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై జిల్లా కలెక్టర్‌తో ఫోన్ ద్వారా సమీక్షించారు. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు, లోతట్టు ప్రాంతాల పరిస్థితి, జలాశయాల్లో నీటి మట్టాలు, విద్యుత్ సరఫరా, తాగునీటి వ్యవస్థ, పంట నష్టం, మత్స్యకారుల భద్రత తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గడచిన రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా సగటున 117.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, 15 ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు కూలగా అగ్నిమాపక సిబ్బంది సహకారంతో తక్షణం తొలగించామని, ప్రాథమిక అంచనాల మేరకు జిల్లావ్యాప్తంగా 1,885 హెక్టార్లలో పంట దెబ్బతిందని కాకినాడ కలెక్టర్ హరేందర్ ప్రసాద్ పవన్ కళ్యాణ్ కి వివరించారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి శాఖల వారీగా పరిస్థితిని 24 గంటలు సమీక్షిస్తున్నట్టు, ప్రస్తుతం పరిస్థితి పూర్తి అదుపులో ఉన్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వరద ముంపు, సహాయక చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇంకా భారీ వర్షాలు కురుస్తుండడంతో పాటు ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉన్న హెచ్చరికలు ఉండడం వల్ల లోతట్టు ప్రాంతాలు, ముంపు పొంచి ఉన్న గ్రామాలు, కాలనీలను నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు .