హైదరాబాద్ : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఐటీ కారిడార్ పరిధిలో గల విప్రో సర్కిల్ వద్ద భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కోసం చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు శుక్రవారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. మన్మోహన్ సింగ్ భారతదేశ ఆర్థిక పురోగతికి దిశానిర్దేశం చేసిన గొప్ప ఆర్థికవేత్త. 1991లో ఆర్థిక మంత్రిగా ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులకు దోహద పడ్డాయి. దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రధానమంత్రిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి.
డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పార్లమెంటు సభ్యుడిగా ఆయన మార్గదర్శకత్వంలో పనిచేసే అవకాశం లభించడం నా ప్రజా జీవితంలో ఎంతో గర్వకారణం అన్నారు ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గౌడ్. కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన అందించిన మద్దతు, మార్గదర్శకత్వాన్ని తాను ఎప్పటికీ మరువలేనని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో డాక్టర్ మన్మోహన్ సింగ్ పాత్ర చారిత్రాత్మకమైనది. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చడంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు , తదుపరి ప్రక్రియలలో ఆయన నాయకత్వం కీలక పాత్ర పోషించాయని గుర్తు చేసుకున్నారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ సేవలకు గుర్తింపుగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తెలంగాణ ప్రజలకు గర్వకారణం అన్నారు. ఆయనకు తగిన గౌరవం కల్పిస్తూ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు చొరవ చూపిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చర్య అభినందనీయం అన్నారు.





