వైఎస్సార్ కడప జిల్లా : పోలీసు విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, ధైర్యం, మానవత్వం ఎంతో కీలకం. పోలీసు యూనిఫాం ప్రజలకు భరోసా కల్పించేలా పనిచేయాలి. పోలీసు- అంటే భయం కాదు.. ప్రజలకు భరోసా అనే భావన ప్రజల్లో కలిగేలా ప్రతి ఒక్కరూ విధులు నిర్వర్తించాలి అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, వైఎస్సార్ కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎస్. సవిత పిలుపునిచ్చారు. బాకరాపేటలోని ఏపీఎస్పీ 11వ బెటాలియన్ పోలీసు పరేడ్ మైదానంలో శనివారం 521 మంది నూతనంగా శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసు కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సవిత హాజరై ప్రసంగించారు. పోలీసు వ్యవస్థకు కానిస్టేబుళ్లే వెన్నెముక అని అన్నారు. దీక్షాంత్ పరేడ్ కేవలం ఒక పరేడ్ మాత్రమే కాదని, శిక్షణార్థి నుంచి బాధ్యతాయుతమైన పోలీసు సిబ్బందిగా మారే కీలక ఘట్టమని అన్నారు. క్రమశిక్షణ, సమన్వయం, ఆత్మవిశ్వాసం, విధి పట్ల అంకితభావాన్ని చాటిన నూతన కానిస్టేబుళ్లు ఇకపై ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని దిశా నిర్దేశం చేశారు.
6,100 కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీలో అనేక అడ్డంకులను అధిగమించి నియామకాలు చేపట్టామని మంత్రి సవిత తెలిపారు. శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లకు ఇచ్చే నెలవారీ స్టైపెండ్‌ను రూ.4,500 నుంచి రూ.12 వేలకు పెంచామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 శిక్షణా కేంద్రాల్లో సుమారు 5,800 మంది కానిస్టేబుళ్లు శిక్షణ పూర్తి చేసుకున్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరాలు, సాంకేతిక ఆధారిత నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం వంటి కొత్త సవాళ్లు పోలీసుల ముందున్నాయని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకోవడంతో పాటు కొత్త చట్టాలపై నిరంతరం అవగాహన పెంచుకోవాలని సూచించారు. కాలానుగుణంగా.. పరిణతి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అలవర్చు కోవాలన్నారు. పోలీసు యూనిఫారంలో తన బిడ్డను చూడాలని, సమాజాన్ని రక్షించడంలో తమబిడ్డ కూడా ఒక బృహత్తర బాధ్యతను నిర్వహించేలా ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు అభినందనలు తెలియ జేస్తున్నామన్నారు.





