ఉత్తరాంధ్ర కోసం ఐదు అంశాల ప్రణాళిక
అమరావతి : ఉత్తరాంధ్ర కోసం ఐదు అంశాల ప్రణాళికను ప్రకటించారు మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి. నదుల అనుసంధానం , ఆక్రమణల తొలగింపు ద్వారా ఉద్దానం సహా ఆ ప్రాంతంలోని నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించవచ్చని ఆయన పేర్కొన్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఒక ఐదు అంశాల ప్రణాళికను ప్రతిపాదించారు. ఇందులో ప్రాంతీయ అభివృద్ధి అథారిటీ ఏర్పాటు, వార్షిక బడ్జెట్ కేటాయింపులు, నీటి కొరత పరిష్కారానికి చర్యలు వంటివి ఉన్నాయి. 2,000 గ్రామాల్లో జీవన ప్రమాణాలను మెరుగు పరచడం, వలసలను అరికట్టడం , పరిశ్రమలను ప్రోత్సహించడంపై కూడా ఈ ప్రణాళిక దృష్టి సారిస్తుందని ఆయన చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల కోసం తీసుకునే చర్యలలో రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ అమలు పై దృష్టి సారిస్తామన్నారు.
జీవో నం. 3కి చట్టపరమైన హోదా కల్పించడం, మైనింగ్ , గంజాయి సాగును అరికట్టడం, అలాగే గిరిజన నైపుణ్యాలను పెంపొందించేందుకు విశ్వ విద్యాలయాల ఏర్పాటు వంటివి ఉంటాయి. నదుల అనుసంధానం , ఆక్రమణల తొలగింపు ద్వారా ఉద్దానం సహా ఆ ప్రాంతంలోని నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించ వచ్చని రెడ్డి పేర్కొన్నారు. విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులలో ఒకటిగా చేస్తామన్న వైసీపీ హామీని ఆయన విమర్శించారు, ఆ పార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు విజయ సాయి రెడ్డి. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో కూటమి ప్రభుత్వాన్ని కూడా ఆయన తప్పుబట్టారు ఉత్తరాంధ్రపై శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని అంశాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ , ఇతర ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూడా బలమైన నాయకత్వం అవసరమని రెడ్డి అన్నారు.