అమరావతి : అక్వాన్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. అక్వాన్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ గమనంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గంటకు 3 కి.మీ వేగంతో తుఫాన్ కదులుతోందని తెలిపారు. ఇవాళ సాయంత్రానికి తుఫాన్ తీవ్రతపై మరింత స్పష్టత వస్తుందని వివరించారు. తీవ్ర తుఫానుగా మారే ప్రమాదముందని చెప్పిన ఆర్టీజీఎస్ అధికారులు. చెన్నైకి 610కి.మీ, మచిలీపట్నానికి 660 కి.మీ, విశాఖపట్నానికి 670 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 790 కి.మీ దూరంలో ప్రస్తుతం తుఫాన్ కేంద్రీకృతమైందన్నారు. అక్వాన్ తుఫాన్ కారణంగా 19, 20వ తేదీల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయని అంచనా వేశామన్నారు ఎండీ. తుఫాన్ తీరం దాటే సమయంలో ఈదురు గాలులకు అవకాశముందని అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఇటీవల కాలంలో రాష్ట్రాన్ని మూడో తుఫాన్ తాకుతోందన్నారు. విపత్తులు వచ్చాయని భయపడాల్సిన అవసరం లేదన్నారు. వాటి ప్రభావం ప్రజలపై పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం. ప్రజలకు, తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు పంపుతూనే ఉండాలని సూచించారు. స్వర్ణ గ్రామ, స్వర్ణవార్డు సిబ్బంది ద్వారా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు నేరుగా సమాచారం అందించాలని పేర్కొన్నారు..మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎంతటి పెద్ద విపత్తు సంభవించినా తమను ఆదుకోవడానికి ప్రభుత్వం, అధికారులు ఉన్నారనే భరోసా కల్పించాలన్నారు.




