గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు డిక్లేర్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ అభ్యర్థులను ఖరారు చేసిన విషయాన్ని వెల్లడించారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం నుంచి సామ రామ్మోహన్ రెడ్డిని, నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం నుంచి రామ్‌రెడ్డి సర్వోత్తం రెడ్డిని నామినేట్ చేశారు. రెండు తెలంగాణ ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ రామ్‌రెడ్డి సర్వోత్తం రెడ్డి , రామ్మోహన్ రెడ్డిలను ప్రకటించింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే తెలంగాణ శాసన మండలి ఎన్నికల కోసం గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ రెడ్డి అభ్యర్థులను ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో, గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల్లో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు జరగబోయే ఎన్నికల కోసం కొత్త ఓటర్ల జాబితాల తయారీకి సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ సీఈఓ షెడ్యూల్ ప్రకారం, కొత్త ఓటర్ల జాబితాల తయారీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ జారీ చేసిన నోటీసును సెప్టెంబర్ 28న అధికారిక గెజెట్‌లో ప్రచురించారు. ఈ నోటీసును అక్టోబర్ 15న, మరోసారి అక్టోబర్ 25న కూడా పునః ప్రచురిస్తారు. ఫారం-18లో దరఖాస్తులను స్వీకరించడానికి నవంబర్ 6 చివరి తేదీ. ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ , ముద్రణ 2023 నవంబర్ 20న జరుగుతుంది. దాని ప్రచురణ 2023 నవంబర్ 25న వెల్లడిస్తామని తెలిపారు సీఈఓ.