లబ్ధిదారుల గుర్తింపు గడువు పెంపు : సవిత
అమరావతి : రెండో విడత నేతన్నల సేవలో పథకం కింద ఆర్థిక సాయం అందించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చురుగ్గా సాగుతున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు ఏడో తేదీ నుంచి నేతన్నల సేవలో పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. మొదటి విడతలో 71,536 మందికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించామన్నారు. రెండో విడతలో ఆర్థిక సాయం అందించడానికి లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 36,632 దరఖాస్తులు వచ్చాయన్నారు. అర్హుల ఎంపిక ప్రక్రియ గడువు సెప్టంబర్ 30వ తేదీతో ముగిసిందన్నారు.
ఇంకా దరఖాస్తుల పరిశీలనతో పాటు, అర్హుల గుర్తింపు పూర్తి చేయాల్సి ఉండడంతో గడువును అక్టోబర్ 3వ తేదీ వరకూ పెంచినట్లు మంత్రి సవిత స్పష్టం చేశారు. చేనేత అధికారుల దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని ఆదేశించారు. ఏ ఒక్క అర్హుడికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. అర్హులైన నేతన్నలందరికీ నేతన్నల సేవలో పథకం కింద ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. చేనేతల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి నేతన్నకూ ఆర్థిక మేలు చేకూరేలా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు నాయుడు చేపడుతున్నారన్నారు. ఇప్పటికే ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని, కొత్త పెన్షన్లు కూడా త్వరలో ఇవ్వబోతున్నామని మంత్రి సవిత తెలిపారు.