రేవంత్ రెడ్డి కామెంట్స్ పై పువ్వాడ అజయ్ ఫైర్
ఖమ్మం జిల్లా : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నిప్పులు చెరిగారు. పనిగట్టుకుని ఎలాంటి ఆధారాలు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి కావాలని మాజీ సీఎం కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. గురువారం పువ్వాడ మీడియాతో మాట్లాడారు. పరిపాలన స్థానంలో అబద్ధాలు, ద్వేషం, దూషణలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో పరిపాలనను విస్మరించి రేవంత్ రెడ్డి తన సమయాన్ని అబద్ధాలు, ద్వేషం , దూషణలకే కేటాయిస్తున్నారని పువ్వాడ విమర్శించారు. సిరిసిల్లలో జరిగిన బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు , బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు లపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి కారణంగానే, సిరిసిల్ల సభలో ముఖ్యమంత్రి కెసిఆర్, కెటిఆర్ లపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారని, ఆరోపణలు గుప్పించారని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి వంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి హుందాతనాన్ని పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని, కానీ రేవంత్ రెడ్డి అందుకు భిన్నంగా వ్యక్తిగత విమర్శలు , అభ్యంతరకరమైన భాషను ఉపయోగించారని పువ్వాడ ఆరోపించారు. ప్రజా సమస్యలపై స్పందించడం లేదా ప్రభుత్వ పనితీరును వివరించడం మానేసి, పరిపాలనలో ప్రభుత్వ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నంలో భాగంగానే రేవంత్ రెడ్డి బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని మాజీ మంత్రి ఆరోపించారు. రాజకీయ, వ్యక్తిగత దాడులకు దిగడం కాకుండా, ప్రజల సమస్యలను పరిష్కరించడం , తమ బాధ్యతలను నెరవేర్చడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని పువ్వాడ సూచించారు.