కేటీఆర్ ఆస్తులపై విచారణ చేపట్టాలి : ఆకునూరి
హైదరాబాద్ : మాజీ తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం దోచుకున్న ఆస్తులపై బేషరతుగా విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. తాజాగా సిరిసిల్ల వేదికగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి కేటీఆర్ కు ఉన్న అక్రమ ఆస్తుల చిట్టా విప్పారు. పెద్ద ఎత్తున హొటళ్లు, బంగ్లాలు, వేలాది ఎకరాలు, లెక్కకు మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపించారు. దీనిపై అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ ఎందుకు విచారణ జరిపించడం లేదంటూ ప్రశ్నించారు. వెంటనే కేసీఆర్ ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరిపై విచారణ చేపట్టాలన్నారు ఆకునూరి మురళి.
కేటీఆర్ పేరు మీద హైటెక్ సిటీ లో అయిదు నక్షత్రాల హోటళ్లు ఉన్నాయని. మరి వీటిని ఎలక్షన్ అఫిడవిట్ లో చూపించ కపోతే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం KTR శిక్షార్హుడు అవుతాడని పేర్కొన్నారు. జైల్ కి వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు.. రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా కేసు ఫైల్ చేయించొచ్చు అని తెలిపారు, చీఫ్ సెక్రటరీ ద్వారా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ను ఆదేశించ వచ్చని పేర్కొన్నారు. తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి చర్యలకు ఆదేశించాలని ఒకవేళ మౌనంగా ఉంటే మిమ్మల్ని కూడా అనుమానించాల్సి వస్తుందని హెచ్చరించారు ఆకునూరి మురళి. కేటీఆర్, కేసీఆర్ కుటుంబానికి రాష్ట్రం లో ,దేశం లో విదేశాలలో ఇంకా ఎన్ని ఆస్తులు ఉన్నాయో, ఎంత సంపద ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేసి బయట పెట్టాలని డిమాండ్ చేశారు.