ఎర్ర సత్యం పోరాట స్ఫూర్తితోనే బీసీ రాజ్యాధికారం
నారాయణపేట జిల్లా : అన్యాయాన్ని ఎదిరించి, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన దివంగత, మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం పోరాట స్ఫూర్తితో బీసీలను రాజకీయంగా ఏకం చేసి రాజ్యాధికారం సాధించడమే తమ లక్ష్యమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా ధన్వాడ నుంచి ప్రారంభమైన పాదయాత్ర పసుపుల మీదుగా మరికల్ చేరుకుంది. మార్గమధ్యంలో ప్రజలు, రైతులు, యువతతో మమేకమైన తీన్మార్ మల్లన్న అనంతరం ఆర్టీసీ కార్మికులను కలిశారు. రాబోయే ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనుబంధ బహుజన్ వర్కర్స్ యూనియన్ కు మద్దతు తెలిపి ‘కత్తెర’ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కార్మికులను కోరారు.
అనంతరం మరికల్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో తీన్మార్ మల్లన్న ప్రసంగించారు. ఎర్ర సత్యం పోరాటం, బీసీల రాజకీయ ప్రాతినిధ్యం, కులగణన, బీసీ బడ్జెట్, రైతు భరోసా, రిజర్వేషన్లు తదితర అంశాలపై మాట్లాడారు. ఎర్ర సత్యాన్ని హత్య చేశారు.. కానీ ఆయన పోరాట స్ఫూర్తిని హత్య చేయలేక పోయారని అన్నారు. అణగారిన వర్గాల తరఫున నిలబడి రాజకీయంగా ఎదిగిన ఎర్ర సత్యం 1994లో జడ్చర్ల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, 1996 ఆగస్టు 11న హత్యకు గురయ్యారని పేర్కొన్నారు. ఎర్ర సత్యం అన్నను చంపితే ఆయన ఆలోచన కూడా చనిపోతుందని అనుకున్నారా? ఆయనను భౌతికంగా లేకుండా చేయగలిగారు కానీ ఆయన పోరాట స్ఫూర్తిని మాత్రం లేకుండా చేయలేక పోయారని అన్నారు. ఈ రోజు అదే ఎర్ర సత్యం పోరాట స్ఫూర్తిని మరికల్ చౌరస్తాకు తీసుకొచ్చాం అని మల్లన్న అన్నారు.
బీసీ బిడ్డ రాజకీయంగా ఎదిగితే ఎవరికి ఇబ్బంది వచ్చింది? ఎర్ర సత్యం అన్న ఎదుగుదలను ఎవరు సహించలేక పోయారు? ఆయన హత్య వెనుక ఉన్న నిజాలేమిటి? అని మల్లన్న ప్రశ్నించారు.ఎర్ర సత్యం వంటి నాయకుల పోరాట చరిత్రను కొత్త తరానికి తెలియ జేయాల్సిన అవసరం ఉందన్నారు.ఈ సభ పిరికివాళ్ల సభ కాదు. గుండె ధైర్యంతో పోరాడిన ఎర్ర సత్యం అన్న, పండుగల సాయన్న వంటి పోరాట యోధుల వారసుల సభ. అన్యాయాన్ని చూసి తలవంచడం కాదు.. ఎదిరించడం మనకు వాళ్లు నేర్పిన బాట అని అన్నారు.
బీసీలకు రాజ్యాధికారం వచ్చిన తర్వాత తమ ఆత్మగౌరవానికి ప్రతీకలైన ఎర్ర సత్యం, రాములన్న, పండుగల సాయన్న వంటి పోరాట యోధుల చరిత్రకు సముచిత గౌరవం కల్పిస్తామని చెప్పారు. నారాయణపేట నియోజకవర్గంలో మొత్తం 2,32,062 ఓట్లు ఉండగా అందులో సుమారు 1,56,000 బీసీ ఓట్లు, 33 వేల ఎస్సీ ఓట్లు ఉన్నాయని చెప్పారు. బీసీ ఓట్లలోనే సుమారు 60 వేల ముదిరాజ్ ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు. దీనికి భిన్నంగా రెడ్డి/ఓసీ వర్గాలకు చెందిన ఓట్లు సుమారు 10,652 మాత్రమే ఉన్నాయని, పదివేల ఓట్లు కూడా లేని రెడ్లు ఎమ్మెల్యేలు అవుతున్నారని అన్నారు.