న్యూఢిల్లీ : ఎన్ని దాడులకు పాల్పడినా, అరెస్టులు చేసినా తాము వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని ప్రకటించారు ప్రముఖ సామాజిక కార్యకర్త, ఏఐఎస్ఎఫ్ నాయకురాలు నేహా బోరా. శనివారం సీజేపీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. భారీ ఎత్తున కార్యకర్తలు, మద్దతుదారులు, యువత , జెన్ జీ పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఢిల్లీలో చోటుచేసుకుంటున్న దృశ్యాలు, శాంతియుత నిరసనకారులపై ప్రయోగిస్తున్న అణచివేత స్థాయి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్బంగా మాజీ సీఎం ఎంకే స్టాలిన్. ఆనాడు తాను అనుభవించిన ఎమర్జెన్సీ నాటి బాధాకరమైన జ్ఞాపకాలను తిరిగి గుర్తుకు తెస్తున్నాయని పేర్కొన్నారు.
ఢిల్లీలో, దేశవ్యాప్తంగా నిర్బంధించబడిన రాజకీయ నాయకులు, విద్యార్థులు , యువ నిరసనకారులందరినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీకి అనుబంధంగా వ్యవహరిస్తూ, నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసు అణచివేతను ప్రయోగిస్తున్న తమిళనాడులోని టీవీకే ప్రభుత్వాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకుంటున్న యువతపై కేంద్ర ప్రభుత్వం తన దాడిని తక్షణమే ఆపాలని అన్నారు. అసమ్మతి అనేది నేరం కాదు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ముందుకు వచ్చేవారి గొంతు నొక్కడం ద్వారా మనుగడ సాగించ లేదన్నారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా విషయంలో రాజీ లేదు. ఆయన రాజీనామాతో పాటు, ఎన్నికల సంఘం సంస్థాగత స్వరూపానికి జరిగిన నష్టాన్ని అంతా పూడ్చి, దాని స్వేచ్ఛను, సమగ్రతను పునరుద్ధరించాలని కోరారు.





