ఏపీకి 714 ప్రాజెక్టులు రూ. 22.6 లక్షల కోట్ల పెట్టుబడులు
అమరావతి : ఏపీ రాష్ట్రానికి ఇప్పటి వరకు 714 ప్రాజెక్టులు గ్రౌండ్ కాగా రూ. 22.6 లక్షల కోట్లు వచ్చాయని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పారిశ్రామికవేత్తలు కూడా అదే నిబద్దతతో, పర్యావరణ హితంగా యువతకు మెరుగైన ఉపాధి చూపుతూ రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. జంషెడ్జీ టాటా దేశాన్ని ముందుకు నడిపారని అన్నారు. పారిశ్రామికవేత్తలు కేవలం లాభం లెక్కలు మాత్రమే వేయకుండా మనతో పాటు దేశం, జాతిని ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీ ఫండ్స్ ద్వారా సమాజానికి మేలు చేయాలనే ఆలోచన ఎల్లవేళలా ఉండాలని నొక్కి చెప్పారు పవన్ కళ్యాణ్ . భారతదేశ అభివృద్ధికి జంషెడ్జీ టాటా చేసిన ఎన్నో కార్యక్రమాలు స్ఫూర్తిగా నిలుస్తాయి. ఆయన కేవలం పరిశ్రమలంటే లాభాలు అర్జించే మార్గాలుగానే కాకుండా, జాతిని ముందుకు నడిపించే ఇంధనాలుగా భావించారని పేర్కొన్నారు.
పెట్టుబడుల రాక, పరిశ్రమల స్థాపన అనేది కేవలం లెక్కలు కింద, పారిశ్రామిక ప్రగతి కింద మాత్రమే చూడకూడదని అన్నారు పవన్ కళ్యాణ్. ఇది వేలాది కుటుంబాల జీవనశైలిని మార్చబోయే భరోసాగా భావించాలని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ మార్గదర్శకంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నాయకత్వంలో 2024, జూన్ నుంచి రాష్ట్రానికి 714 ప్రాజెక్టుల రూపంలో రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. వీటిలో రూ.16.6 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ప్రభుత్వ అనుమతులు పూర్తయితే, రూ.4.7 కోట్ల ప్రాజెక్టులు గ్రౌండింగ్ అయ్యాయని చెప్పారు. వీటి వల్ల రాష్ట్రంలో 7.1 లక్షల ఉద్యోగాలు యువతకు రానున్నాయని వెల్లడించారు.